IND vs SA 1st Test Prediction and Playing 11: దక్షిణాఫ్రికాపై టీ20, వన్డేల సిరీస్‌లు గెలుచుకున్న భారత్.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. సూపర్ స్పోర్ట్ పార్క్‌లో ఇరు జట్ల మధ్య నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది. సఫారీ గడ్డపై టెస్టుల్లో తొలిసారి సిరీస్ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో రోహిత్ సేన ఉంది. బలాబలాలను బట్టి చూస్తే ఇరు జట్లూ సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. రెండు టీమ్‌ల నుంచి కూడా టీ20, వన్డే సిరీస్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్న టాప్ ఆటగాళ్లు కొత్త ఉత్సాహంతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హోరాహోరీ సమరం తప్పేలా లేదు. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నుంచి ఆరంభం కానుంది.
తొలి టెస్టులో భారత్ బ్యాటింగ్ కూర్పు మారనుంది. టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడే కేఎల్ రాహుల్.. మిడిలార్డర్‌లో ఆడనున్నాడు. యశస్వి జైస్వాల్ కోసం మరో ఓపెనర్ శుభ్‌మన్ మూడో స్థానంలో ఆడనున్నాడు. విండీస్‌లో టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యశస్వికి అసలైన పరీక్ష ఎదురు కానుంది. రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ విరామం తర్వాత బరిలోకి దిగుతున్నారు. ఉప ఖండం పిచ్‌లపై రాణిస్తున్న శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లకు ఇది పరీక్షే. టెస్టుల్లో తొలిసారి వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్న లోకేష్ రాహుల్‌పై అందరి దృష్టి ఉంది. మహమ్మద్ షమీ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ ఆడే అవకాశముంది. బుమ్రా, సిరాజ్, శార్దూల్, జడేజా బౌలింగ్ కోటాలో ఆడనున్నారు.
వన్డే సిరీస్‌లో ఓడినప్పటికీ దక్షిణాఫ్రికా.. టెస్టుల్లో ప్రమాదకరంగా కనిపిస్తోంది. చివరి సిరీస్ ఆడబోతున్న డీన్ ఎల్గర్.. కెప్టెన్ బవుమా, టోనీ డి జోర్జీ, మార్‌క్రమ్, కీగన్ పీటర్సన్‌తో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. ఇక రబాడ, ఎంగిడి, కొయెట్జీ, జాన్సన్‌లతో పేస్ విభాగం బలంగానే ఉంది. స్పిన్ బాధ్యతలను కేశవ్ మహరాజ్ మోయనున్నాడు. ఎల్గర్‌కు ఘన వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో ఆ జట్టు విజయం కోసం గట్టిగా పోరాడే అవకాశముంది. ఇక దక్షిణాఫ్రికాలోని వేగవంతమైన పిచ్‌ల్లో సూపర్‌స్పోర్ట్ పార్క్ ఒకటి. ఈ పిచ్ మాములుగానే పేసర్లకు సహకరిస్తుంది. వర్షం పడి, మబ్బులు కమ్మితే పేసర్లను ఆపడం కష్టం. ఇక్కడ అధిక బౌన్స్ కారణంగా మొదట బ్యాటింగ్ చేయడం సవాలుతో కూడుకున్నదే. ఇక్కడ 28 టెస్టుల్లో దక్షిణాఫ్రికా 22 విజయాలు సాధించింది.
Also Read: Praja Bhavan: ప్రజాభవన్ ముందు కారు బీభత్సం.. అసలు నిందితుడిని తప్పించిన పోలీసులు?
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్, యశస్వి, శుభ్‌మన్, కోహ్లీ, రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్, జడేజా, శార్దూల్, బుమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్.
దక్షిణాఫ్రికా: ఎల్గర్, మార్‌క్రమ్, జోర్జి, బవుమా, పీటర్సన్, వెరెనీ (వికెట్ కీపర్), జాన్సన్, కేశవ్ , కొయెట్జీ, రబాడ, ఎంగిడి.