IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!

Ind Vs Pak

Ind Vs Pak

IND vs PAK Match Tilak Varma Statement: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్ A జట్టు మంచి శుభారంభాన్ని అందుకుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై ఏకంగా 306 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు భారత జట్టు తన నెక్స్ట్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ A జట్టుతో తలపడనుంది. నవంబర్ 22న జరగనున్న ఈ హైఓల్టేజ్ పోరుపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌పై భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమకు పాకిస్థాన్‌తో మ్యాచ్ కూడా మిగతా మ్యాచ్‌ల మాదిరిగానే అంటూ స్పష్టం చేశాడు.

నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ A జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర అద్భుతమైన సెంచరీలతో జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తిలక్ వర్మ 113 బంతుల్లో 107 పరుగులు చేయగా, కుమార్ కుశాగ్ర 102 బంతుల్లో 117 పరుగులతో చెలరేగాడు. చివర్లో సూర్యాంశ్ షెడ్గే కేవలం 14 బంతుల్లోనే అజేయంగా 36 పరుగులు చేసి స్కోరు పెంచాడు.

333 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో నేపాల్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. హర్షిత్ రాణా 16 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, ప్రిన్స్ యాదవ్ కేవలం 6 పరుగులకే 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో నేపాల్ జట్టు 11.3 ఓవర్లలో కేవలం 26 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ 306 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. లిస్ట్-A క్రికెట్ చరిత్రలో భారత్‌కు 300కుపైగా పరుగుల తేడాతో లభించిన తొలి విజయం. నేపాల్ నమోదు చేసిన 26 పరుగుల స్కోరు లిస్ట్-A క్రికెట్‌లో ఐదో అత్యల్ప స్కోరు.

మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ పై తిలక్ వర్మను ప్రశ్నించగా.. తమ దృష్టి పూర్తిగా ఆటలోని ప్రాథమిక అంశాలపైనే ఉంటుందని, “మా బేసిక్స్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నామన్నారు. ముఖ్యంగా మాకు ఇది మరో సాధారణ మ్యాచ్ మాత్రమే అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ప్రత్యర్థి పాకిస్థాన్ అయినప్పటికీ ప్రత్యేక ఒత్తిడికి లోనుకాకుండా తమ ప్రణాళికల ప్రకారం ఆడతామని స్పష్టం చేశాడు. నవంబర్ 22న పాకిస్థాన్ ఏ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది.