IND vs NZ Semi Final 2023 Preview and Playing 11: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్ సెమీస్ సవాలుకు సిద్ధమైంది. హడావుడి లేకుండా ప్రశాంతంగా పని చేసుకుంటూ ప్రత్యర్థులకు షాకులిచ్చే న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడబోతోంది. ప్రపంచకప్ 2023లో జట్టు ప్రదర్శన, ఆటగాళ్ల ఫామ్, వాంఖడేలో రికార్డులు చూస్తే.. నేటి మ్యాచ్‌లో రోహిత్ సేననే ఫేవరెట్. అయితే చరిత్ర మాత్రం భారత్ వైపు లేదు. అయినా కూడా అంచనాలను మించి ఆడుతున్న భారత్.. గత ప్రపంచకప్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకొవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది ‘ప్రతీకార’ సమయం (It’s Time for Revenge) అని అంటున్నారు.
లీగ్ దశ ఆరంభం నుంచి చివరి వరకు నిలకడగా ఆడి అందరికంటే ముందుగా సెమీస్ బెర్తును భారత్ ఖరారు చేసుకుంది. బ్యాటర్లు, బౌలర్ల ప్రదర్శన కారణంగానే ఇది సాధ్యం అయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుత ఆరంభాలు ఇస్తున్నారు. ఇది జట్టుకు శుభసూచికం. విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ కనబర్చుతున్నాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా పరుగుల వరద పారిస్తున్నారు. టీమిండియా టాప్ ఆర్డర్ బలంగా ఉంది. బౌలర్లు మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు వికెట్స్ తీస్తూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందరూ చెలరేగితే విజయం కష్టమేమీ కాదు.
న్యూజిలాండ్ తరఫున రచిన్ రవీంద్ర సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. మూడు శతకాలు సహా 565 పరుగులు చేసిన అతడిని త్వరగా పెవిలియన్ చేర్చాలి. దేవాన్ కాన్వే లీగ్ దశలో రాణించకపోయినా.. తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ నుంచే పెను ప్రమాదం పొంచి ఉంది. భారత బౌలర్లపై అతడికి మంచి రికార్డుంది. డారిల్ మిచెల్ లీగ్ దశలో భారత్‌పై సెంచరీ చేసాడు. మిడిలార్డర్లో గ్లెన్ ఫిలిప్స్ ప్రమాదకరం. దాదాపు కివీస్ బ్యాటర్లు అందరూ ప్రమాదకరమే. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ ఎంతో కీలకం. అతణ్ని ఆరంభ ఓవర్లలో ఎదుర్కోవడం మన బ్యాటర్లకు పెను సవాల్. టీమ్ సౌథీ, లుకీ ఫెర్గూసన్ మంచి ఊపులోనే ఉన్నారు. శాంట్నర్, రచిన్, ఫిలిప్స్ స్పిన్ వేయనున్నారు.
Also Read: Gold Price Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. తులం ఎంతంటే?
సాధారణంగా అయితే ముంబైలోని వాంఖడే మైదానంలో పరుగుల వరద పారుతుంటుంది. ఈ ప్రపంచకప్‌లోనూ ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టమవుతోంది. వాంఖడేలో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువ. ఐతే ప్రపంచకప్ 2023లో పేసర్లు విజృంభిస్తున్నారు. లీగ్ దశ మ్యాచ్‌లను చూస్తే.. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో తొలి 20 ఓవర్లలో పేసర్లను ఎదుర్కోవడం సవాలే. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్, కోహ్లీ, శ్రేయస్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్/అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, బుమ్రా, సిరాజ్.
న్యూజిలాండ్: కాన్వే, రచిన్, విలియమ్సన్ (కెప్టెన్), మిచెల్, లేథమ్, ఫిలిప్స్, చాప్‌మన్, శాంట్నర్, సౌథీ, ఫెర్గూసన్, బౌల్ట్.