NTV Telugu Site icon

IND vs NZ: రోహిత్‌ను తప్పుపట్టలేం.. ఓటమిలో వారి పాత్ర కూడా ఉంది: కివీస్ మాజీ పేసర్‌

Team India Test

Team India Test

సుదీర్ఘకాలం అనంతరం స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. న్యూజిలాండ్‌పై మొదటి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను కివీస్‌కు అప్పగించింది. సొంతగడ్డపై చెత్త ప్రదర్శన చేసిన రోహిత్ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పిన్‌ ఆడటంలో విఫలమైన బ్యాటర్ల ఆట తీరును ఎత్తిచూపుతున్నారు. కొందరు రోహిత్‌ శర్మ కెప్టెన్సీ పైనా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ పేసర్‌ సైమన్ డౌల్‌ హిట్‌మ్యాన్‌కు మద్దతు పలికాడు.

న్యూజిలాండ్‌పై సిరీస్ ఓటమికి రోహిత్‌ శర్మను నిందించలేమని, ఓటమిలో సీనియర్ బౌలర్ల పాత్ర కూడా ఉందని సైమన్ డౌల్‌ అన్నాడు. ‘న్యూజిలాండ్‌పై రోహిత్‌ శర్మ డిఫెన్సివ్‌ మోడ్‌లో ఆడాడని పలువురు అంటున్నారు. బౌలర్ల విషయానికి వస్తే సీనియర్ స్పిన్‌ బౌలర్లు జట్టులో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా సొంతంగా ఫీల్డ్ సెట్ చేసుకుంటారు. అప్పుడు రోహిత్‌ను అన్ని వేళలా మనం తప్పుపట్టలేం. ఓటమిలో బౌలర్ల పాత్ర కూడా ఉందని నేను భావిస్తున్నా’ అని కివీస్ మాజీ పేసర్‌ చెప్పుకొచ్చాడు.

Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

‘న్యూజిలాండ్‌ సిరీస్‌ ఫలితాన్ని భారత ఆటగాళ్లు త్వరగా మరిచిపోవాలి. మూడో టెస్టులో విజయం సాధించి.. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలి. అస్త్రాలు గడ్డపై పేసర్లు కీలక పాత్ర పోషిస్తారు. భారత్ బ్యాటర్లు ఆ పరిస్థితుల్లో బాగా ఆడతారు. కంగారో గడ్డలో సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు జట్టులో సరైన ఆటగాళ్లు ఉన్నారు’ అని సైమన్ డౌల్‌ పేర్కొన్నాడు. కివీస్ టెస్ట్ సిరీస్‌ అనంతరం ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ భారత్‌ ఆడనుంది. నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం కానుంది.

Show comments