IND vs NZ 3rd Test: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ముంబై టెస్టు మ్యాచ్ ఫలితం మూడో రోజే తేలే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 2 రోజుల ఆట మాత్రమే పూర్తి అవ్వగా, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. దింతో మూడో రోజు ఆట ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్లకు 171 పరుగులు చేసి 143 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతానికి ఆధిక్యం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాల్గవ ఇన్నింగ్స్ గణాంకాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇది ఇప్పుడు టీమ్ ఇండియా అభిమానులకు పెద్ద టెన్షన్‌గా నిలుస్తోంది.
Read Also: Kedarnath Dham: నేటి నుంచి ఆరు నెలల పాటు కేదార్‌నాథ్ ఆలయం మూసివేత
మూడో రోజు ఆటలో, న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఒక్కవికెట్ మాత్రమే ఉన్న గరిష్టంగా పరుగులు చేయాలనీ చూస్తోంది. అదే సమయంలో, న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను వీలైనంత త్వరగా ముగించడానికి టీమిండియా ప్రయత్నం చేస్తుంది. రెండో రోజు ఆటలో పిచ్‌పై చాలా మలుపులతో కూడిన పరిస్థితి కనపడింది. కాబట్టి మూడో రోజు కూడా స్పిన్నర్లు మ్యాచ్‌పై ఆధిపత్యం చెలాయిస్తారు. కానీ, టీమిండియా టెన్షన్ విషయమేంటంటే.. ఇప్పటివరకు ఈ గడ్డపై నాలుగో ఇన్నింగ్స్‌లో 150కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఒక్కసారి మాత్రమే ఛేదించడం విశేషం.
దక్షిణాఫ్రికా జట్టు వాంఖడే స్టేడియంలో అతిపెద్ద ఛేజింగ్ రికార్డు సృష్టించింది. 2000లో టీమిండియాపై దక్షిణాఫ్రికా ఈ ఘనత సాధించింది. అప్పుడు టీమిండియా కెప్టెన్ సచిన్ టెండూల్కర్. హాన్సీ క్రోంజే నాయకత్వంలో దక్షిణాఫ్రికా 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. అలాగే 1980లో ఇక్కడ టీమిండియాపై ఇంగ్లండ్ 98 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దింతో వాంఖడే స్టేడియంలో నాలుగో ఇన్నింగ్స్ టీమిండియాకు చాలా భారం కానుందని. మ్యాచ్ గెలవాలంటే భారత్ ఈ చరిత్రను ఎలాగైనా మార్చాల్సిందేనని స్పష్టం అవుతోంది. ఇకపోతే, ముంబైలోని వాంఖడే స్టేడియంలో గత 12 ఏళ్లలో భారత జట్టు ఏ టెస్టులోనూ ఓడిపోలేదు. ఈ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత టీమిండియాపై ఉంది. టీమిండియా చివరిసారిగా నవంబర్ 2012లో వాంఖడేలో ఇంగ్లండ్ చేతిలో ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను ఈ గడ్డపై టెస్టుల్లో భారత్ ఓడించింది.