IND vs NZ 3rd T20I: గౌహతిలో టీమిండియా బ్యాటర్లు విశ్వ రూపం దాల్చారు. బౌలర్ ఎవరైనా సరే బాల్ బౌండరీ దాటాల్సిందే అన్నట్లుగా రెచ్చిపోయారు. మూడో టీ20లో టీమిండియా న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ఎటాక్ తో కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. కివీస్ బ్యాటర్స్ లో గ్లెన్ ఫిలిప్స్ (48), మార్క్ చాప్మన్ (32) మాత్రమే చెప్పుకో తగ్గ స్కోర్ చేశారు.
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాటింగ్‌లో మొదటి బంతికే సంజు శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత పరుగుల తుఫాను మొదలైంది. ఇన్ ఫామ్ బ్యాటెర్ అబిషేక్ శర్మ ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 14 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయడంతో రెండో వేగవంతమైన భారత అర్ధశతకం నమోదు చేశాడు.
ఇదివరకు యువరాజ్ సింగ్ 12 బంతుల్లో చేసిన రికార్డు అలాగే ఉంది. షార్ట్ బాల్‌ను ఫైన్ లెగ్ మీదుగా కొట్టిన సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసిన అబిషేక్ తన ట్రేడ్‌మార్క్ సెలబ్రేషన్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. అతనికి ఇషాన్ కిషన్ (28) సహకారం అందించగా, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తనదైన ధనాధన్ ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. కేవలం 26 బంతుల్లో 57 పరుగులతో అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 10 ఓవర్లలోనే భారత్ 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో, 60 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. వచ్చామా… కొట్టామా… గెలిచామా అన్నట్లుగా టీమిండియా ఈ మ్యాచ్‌లో పూర్తిస్థాయి ఆధిపత్యం చూపించింది.
