IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్ విజయంపై టీమిండియా కన్నేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. నేడు వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీనితో మొదట న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేయనుంది.
వెల్లింగ్టన్‌లో గాలుల ప్రభావం ఉండటంతో పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సి ఉంటుందని టాస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. జట్టులో మెరుగుపరుచుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయని, అవసరమైన సమయంలో ఆటగాళ్లంతా బాధ్యత తీసుకుంటుండటం బలమైన జట్టుకు నిదర్శనమని అన్నారు. మూడో టీ20 కోసం భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రెండో టీ20 మ్యాచ్‌ల్లో ఆడిన ప్లేయింగ్ XI నే కొనసాగించింది. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి మూడో స్థానంలో అవకాశం దక్కింది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడనున్నాడు.
మరోవైపు న్యూజిలాండ్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ స్థానాల్లో ఆడమ్ మిల్నే, కైల్ జేమీసన్, మాథ్యూ ఫిషర్ తుది జట్టులోకి వచ్చారు. పిచ్‌పై మంచి పేస్, బౌన్స్ కనిపిస్తోందని, తాను టాస్ గెలిచినా ముందుగా బౌలింగ్‌నే ఎంచుకునేవాడినని కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు. సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఈ పోరులో ఓడితే మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతమవుతుంది. దీంతో సిరీస్‌ను కాపాడుకునేందుకు కివీస్, హ్యాట్రిక్ విజయంతో సిరీస్ పట్టేయాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతున్నాయి.
భారత్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI:
ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), బెవాన్ జాకబ్స్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాథ్యూ ఫిషర్, కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ.

