NTV Telugu Site icon

R Ashwin Record: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్‌.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా రికార్డు!

R Ashwin

R Ashwin

టీమిండియా వెటరన్ స్పిన్న‌ర్ రవిచంద్రన్ అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డ‌బ్ల్యూటీసీ)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యాష్ రికార్డుల్లోకెక్కాడు. పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్‌ రెండు వికెట్స్ పడగొట్టడంతో ఈ రికార్డు సొంతమైంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అశ్విన్.. ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బ్ల్యూటీసీ మ్యాచుల్లో 188 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ జాబితాలో ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ (187)ను ఆర్ అశ్విన్ అధిగమించాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేసర్లు పాట్ కమిన్స్ (175), మిచెల్ స్టార్క్‌ (147) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్టువర్ట్ బ్రాడ్ (134) ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-5లో ముగ్గురు ఆసీస్‌ ప్లేయర్లే కావడం గమనార్హం. 2019లో డబ్ల్యూటీసీని ఐసీసీ ప్రారంభించగా.. 39 టెస్టులు ఆడిన అశ్విన్ 188 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 11 సార్లు 5 వికెట్లు సాధించాడు. లైయన్ 43 టెస్టుల్లో 187 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Tecno Pova 6 Neo: ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ ఆఫర్.. 12 వేలకే ‘టెక్నో పోవా 6 నియో’!

ఈ టెస్టులో ఆర్ అశ్విన్ తన తొలి ఓవర్‌లోనే వికెట్ సాధించాడు. యాష్ అద్భుతమైన బంతికి కివీస్ కెప్టెన్ టామ్‌ లాథమ్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. టెస్టుల్లో లాథమ్‌ను అశ్విన్ 9 సార్లు ఔట్ చేయడం విశేషం. విల్ యంగ్‌ వికెట్‌ను రివ్యూలో దక్కించుకున్నాడు. లెగ్‌ సైడ్ దిశగా వేసిన బంతిని యంగ్ షాట్‌కు యత్నించి.. కీపర్ రిషబ్ పంత్ చేతికి చిక్కాడు. భారత ఫీల్డర్లు అప్పీలు చేసినా.. ఫీల్డ్ అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. డీఆర్‌ఎస్‌ తీసుకోమని కెప్టెన్ రోహిత్ శర్మను సర్ఫరాజ్‌ ఖాన్ కోరాడు. రోహిత్ సమీక్షకు వెళ్లగా.. రిప్లేలో ఔట్‌ అని తేలింది. దాంతో సర్ఫరాజ్‌పై ప్రశంసలు కురిసాయి. కివీస్ ప్రస్తుతం 39 ఓవర్లలో 2 వికెట్స్ నష్టానికి 127 రన్స్ చేసింది.