NTV Telugu Site icon

IND vs NZ 2nd Test: నేటి నుంచే రెండో టెస్టు.. రాహులా, సర్ఫరాజా!

Ind Vs Nz

Ind Vs Nz

సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టుకు బెంగళూరులో ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 46కే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో పోరాడినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఉన్న భారత్‌.. పూణేలో పోరుకు సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్‌ మధ్య గురువారం నుంచే రెండో టెస్టు ఆరంభం కానుంది. మరోవైపు చాలా ఏళ్ల తర్వాత భారత్‌లో సాధించిన విజయం కివీస్‌ విశ్వాసాన్ని పెంచింది. రెట్టించిన విశ్వాసంతో ఉన్న కివీస్‌.. భారత్‌లో తొలిసారి టెస్టు సిరీస్‌ నెగ్గాలనే లక్ష్యంతో ఉంది.

బెంగళూరులో తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆకట్టుకున్నారు. సర్ఫరాజ్‌ ఖాన్‌ 150 పరుగులతో సత్తా చాటాడు. రిషబ్‌ పంత్‌ తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఓ దశలో వీళ్లిద్దరి భాగస్వామ్యం భారత్‌లో గెలుపు ఆశలు రేపింది. సీనియర్‌ ప్లేయర్స్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు హాఫ్ సెంచరీలు బాదారు. అయితే వీరి నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ కుదురుకోవాల్సి ఉంది. అశ్విన్, జడేజా, కుల్దీప్ స్పిన్‌ భారాన్ని మోయన్నారు. తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన సిరాజ్‌ స్థానంలో ఆకాశ్‌ను తీసుకునే అవకాశముంది.

మెడ పట్టేయడంతో మొదటి టెస్టుకు దూరమైన శుభ్‌మన్‌ గిల్‌ తిరిగి అందుబాటులోకి రావడంతో.. ఎవరిని తప్పిస్తారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. గిల్‌ గైర్హాజరీలో అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. సీనియర్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ పేలవ ప్రదర్శన చేశాడు. ఈ ఇద్దరిలో ఒకరికే అవకాశం దక్కుతుంది. మరి జట్టులో ఎవరు ఉంటారో చూడాలి. తొలి టెస్టులో మోకాలి నొప్పితో పంత్‌ కాస్త ఇబ్బందిపడడంతో.. పూణేలో బరిలోకి దిగడంపై సందేహాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే అతడికి ఎలాంటి సమస్యలూ లేవని కోచ్‌ గంభీర్‌ చెప్పాడు.

రవీంద్ర, కాన్వే, యంగ్‌ల ఫామ్‌ ఆ న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం. మిచెల్, బ్లండెల్, లాథమ్‌ కూడా రాణించాలని కివీస్‌ ఆశిస్తోంది. సౌథీ, ఒరోర్క్‌లలో ఒకరిని తప్పించి.. కివీస్‌ అదనపు స్పిన్నర్‌ను తీసుకునే అవకాశముంది. శాంట్నర్‌కు అవకాశం దక్కొచ్చు. న్యూజిలాండ్‌ ఇప్పటివరకు భారత్‌లో సిరీస్‌ నెగ్గలేదు. మొదటి టెస్టులో గెలిచి.. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది.

పూణేలో పేసర్లు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. మందకొడి పిచ్‌ మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ స్పిన్నర్లకు మరింత సహకారం లభిస్తుంది. మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు. మ్యాచ్ ఉదయం 9.30కి ఆరంభం అవుతుంది. 9 గంటలకు టాస్ పడనుంది. జియో సినిమా ఆప్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

తుది జట్లు (అంచనా):
భారత్‌: యశస్వి, రోహిత్, గిల్, కోహ్లీ, పంత్, సర్ఫరాజ్‌/రాహుల్, జడేజా, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, ఆకాశ్‌/సిరాజ్‌.
న్యూజిలాండ్‌: లాథమ్, కాన్వే, యంగ్, రవీంద్ర, మిచెల్, బ్లండెల్, ఫిలిప్స్, శాంట్నర్, సౌథీ/ఒరోర్క్, హెన్రీ, అజాజ్‌.