NTV Telugu Site icon

IND vs NZ 2nd Test: లంచ్ బ్రేక్.. న్యూజిలాండ్ స్కోర్ 92/2!

Team India Test

Team India Test

పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజులో తొలి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి కివీస్ 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్లు డేవాన్ కాన్వే (47), రచిన్ రవీంద్ర (5) క్రీజ్‌లో ఉన్నారు. కెప్టెన్ టామ్‌ లాథమ్‌ (15), విల్ యంగ్ (18)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈ ఇద్దరినీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ అవుట్ చేశాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 32 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. టామ్‌ లాథమ్‌ను ఔట్ చేసిన అశ్విన్‌.. భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు. యాష్ అద్భుతమైన బంతికి కివీస్ కెప్టెన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. డేవాన్ కాన్వేతో కలిసి విల్ యంగ్ ఇన్నింగ్స్‌ను నడిపించేందుకు ప్రయత్నించాడు. అయితే అశ్విన్‌ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. లెగ్‌సైడ్‌ వేసిన బంతిని ఆడే క్రమంలో బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని.. పంత్ చేతుల్లో పడింది. భారత ఫీల్డర్లు అప్పీలు చేసినా ఫీల్డ్ అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. డీఆర్‌ఎస్‌ తీసుకోమని కెప్టెన్ రోహిత్ శర్మను సర్ఫరాజ్‌ ఖాన్ కోరాడు.రోహిత్ సమీక్షకు వెళ్లగా.. రిప్లేలో ఔట్‌ అని తేలింది.

Also Read: Tecno Pova 6 Neo: ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ ఆఫర్.. 12 వేలకే ‘టెక్నో పోవా 6 నియో’!

డేవాన్ కాన్వేకు రచిన్ రవీంద్ర జత కలిశాడు. కాన్వే ఎక్కువగా స్ట్రైక్ తీసుకుని పరుగులు చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. మొదటి టెస్టులో సెంచరీ చేసిన రవీంద్ర.. ఇప్పటికే కుదురుకున్నాడు. ఈ ఇద్దరిని అవుట్ చేస్తే కానీ.. కివీస్ భారీ చేయకుండా అడ్డుకట్ట వేయొచ్చు. రెండో సెషన్లో భారత బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. ఈ టెస్ట్ గెలవడం టీమిండియాకు అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే.