బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండో టెస్టులో విజయం సాధించాలని చూస్తోంది. పూణేలో గురువారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తుది జట్టులో స్థానం కోసం సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌ల మధ్య గట్టి పోటీనెలకొంది. ఇది వాస్తవమేనని, అందులో దాచడానికి ఏమీ లేదని టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె తెలిపాడు.
ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టెన్ డస్కాటె మాట్లాడుతూ… ‘నిజమే.. మిడిల్ ఆర్డర్‌లో గట్టి పోటీ నెలకొంది. దాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదు. బెంగళూరు టెస్ట్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. లోకేష్ రాహుల్ విషయంలో మాకు ఆందోళనేమీ లేదు. అతడు బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రాహుల్ మానసిక స్థితి కూడా బాగుంది. అయితే రెండో టెస్ట్ మ్యాచ్‌కు ఉన్న ఆరు బ్యాటింగ్ స్థానాల్లో ఏడుగురి నుంచి ఎలా సర్దుబాటు చేయాలో చూడాలి. పిచ్‌ని పరిశీలించి.. జట్టుకు ఉపయోగపడే మంచి నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నాడు.
Also Read: David Warner Retirement: రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటా.. వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మెడ నొప్పి కారణంగా తొలి టెస్టుకు యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ దూరం కావడంతో.. సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగుల టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 0, 12 రన్స్ చేశాడు. బెంగళూరు టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో.. రాహుల్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. పూణే టెస్టుకు గిల్ అందుబాటులోకి వస్తే.. రాహుల్‌పై వేటు వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఆస్ట్రేలియా లాంటి కీలక సిరీస్ ఉన్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.