NTV Telugu Site icon

IND vs NZ: రవీంద్ర సెంచరీ.. భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్! భారత్‌కు కష్టమే

Rachin Ravindra Southee

Rachin Ravindra Southee

Rachin Ravindra and Tim Southee’s 100 Plus Partnership: బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. మూడోరోజు ఆటలో లంచ్‌ బ్రేక్ సమయానికి కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 299కి చేరింది. స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (104 నాటౌట్: 125 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా.. పేసర్ టిమ్‌ సౌథీ (49 నాటౌట్: 50 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడుతున్నాడు. ఎనిమిదో వికెట్‌కు ఈ ఇద్దరు 97 బంతుల్లోనే 112 పరుగులను జోడించారు.

ఓవర్‌నైట్ 180/3 స్కోరుతో మూడోరోజైన శుక్రవారం ఆటను ప్రారంభించిన కివీస్‌..మొదటి సెషన్లో వరుసగా వికెట్స్ కోల్పోయింది. పేసర్లు సిరాజ్‌, బుమ్రాతో పాటు స్పిన్నర్ జడేజా వికెట్లు పడగొట్టారు. దాంతో న్యూజిలాండ్‌ 7 వికెట్లు కోల్పోయి 233 రన్స్ చేసింది. ఇక కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగియడానికి ఇంకెంతసేపు పట్టదని అందరూ అందుకున్నారు. కానీ రచిన్ రవీంద్ర, టిమ్‌ సౌథీలు ఎదురుదాడికి దిగారు. పేస్, స్పిన్‌ బౌలింగ్‌ను చితకొట్టారు.

Also Read: IND vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 450 రన్స్ చేస్తుంది: ఆకాశ్

ముఖ్యంగా హాఫ్ సెంచరీ అనంతరం రవీంద్ర రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. అశ్విన్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నాడు. ఈ క్రమంలోనే బౌండరీతో సెంచరీ పూర్తిచేశాడు. మరోవైపు సౌథీ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడీని విడదీయడానికి కెప్టెన్ రోహిత్ బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పటికే 300కి చేరువైన లీడ్‌తో మ్యాచ్‌పై కివీస్‌ పట్టు సాధించింది. ఇంకా రెండు రోజులు ఉండడంతో రోహిత్ సేన ఏ మేరకు పోరాడుతుందో చూడాలి. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు పడగొట్టాడు.