NTV Telugu Site icon

IND vs NZ: నేడే భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టెస్టు.. వాతావరణం, పిచ్ రిపోర్ట్ డీటెయిల్స్!

Ind Vs Nz 1st Test

Ind Vs Nz 1st Test

IND vs NZ Pitch and Weather Conditions: స్వదేశంలో మరో టెస్టు సిరీస్‌ లక్ష్యంగా భారత్ పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టు నేటి నుంచే ఆరంభం కానుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో చోటుపై కన్నేసిన రోహిత్ సేన.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు శ్రీలంక చేతిలో ఓడిన న్యూజిలాండ్‌.. జోరుమీదున్న టీమిండియాను ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి.

శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు రిషబ్ పంత్‌ పునరాగమనంలో ఆకట్టుకున్నాడు. లోకేష్ రాహుల్‌ కూడా పరుగులు చేస్తున్నాడు. సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఫామ్ అందుకుంటే తిరుగుండదు. గిల్‌ మెడ పట్టేయడంతో అతడు ఆదుకుంటే.. సర్ఫరాజ్‌ ఖాన్‌ జట్టులోకి వస్తాడు. బౌలింగ్‌లో అశ్విన్, జడేజా, బుమ్రా, సిరాజ్‌ అదరగొడుతున్నారు. అదనపు స్పిన్నర్‌ను తీసుకోవాలా లేదా ఫాస్ట్‌ బౌలర్‌ను ఆడించాలా అన్నది నేడు తేలనుంది.

న్యూజిలాండ్‌ ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత్‌లో టెస్టు సిరీస్‌ నెగ్గలేదు. ఆటగాళ్లు సరైన ఫామ్‌లో లేని నేపథ్యంలో ఈసారి కూడా కష్టమే. లంకలో స్పిన్‌కు దాసోహమైన కివీస్ బ్యాటర్లు ఎలా పుంజుకుంటారో చూడాలి. సీనియర్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం వారికి పెద్ద లోటే. బెంగళూరులో పరిస్థితులు అనుకూలిస్తే కివీస్‌ పేసర్లు మ్యాట్‌ హెన్రీ, ఒరూర్కె, సౌథీ భారత బ్యాటర్లకు సవాలు విసరగలరు.

ఈ టెస్టు మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచింది. మొదటి 2-3 రోజుల ఆటకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశముంది. బెంగళూరులో భారీ వర్షం వల్ల మంగళవారం ఇరు జట్ల ప్రాక్టీస్‌ సెషన్‌ కూడా తుడిచిపెట్టుకుపోయింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో డ్రైనేజ్‌ సౌకర్యం బాగుండడం సానుకూలాంశం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పిచ్‌ సీమర్లకు అనుకూలించే అవకాశముంది.

జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్, జైస్వాల్, గిల్‌, కోహ్లీ, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్‌/కుల్దీప్, బుమ్రా, సిరాజ్‌.
న్యూజిలాండ్‌: కాన్వే, లేథమ్, యంగ్, రవీంద్ర, మిచెల్, బ్లండెల్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, సౌథీ, అజాజ్, ఒరూర్కె.

 

Show comments