Site icon NTV Telugu

IND vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 450 రన్స్ చేస్తుంది: ఆకాశ్

Team India Test

Team India Test

Aakash Chopra Says India Score 450+ Runs: బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలోని పిచ్‌ తొలుత బౌలింగ్‌కు అనుకూలంగా ఉండడంతో కివీస్ పేసర్లు రెచ్చిపోయారు. దాంతో భారత్ స్టార్ బ్యాటర్లు అందరూ వరుసగా పెవిలియన్ చేరారు. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 81 ఓవర్లలో 7 వికెట్లకు 345 స్కోర్ చేసింది. ప్రస్తుతం 299 ఆధిక్యం సాధించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేస్తేనే.. ఓటమి నుంచి బయటపడొచ్చు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 450కి పైగా పరుగులు చేస్తుందని ఆకాశ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. ‘మ్యాచ్ సాగే కొద్దీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోంది. న్యూజిలాండ్‌ బ్యాటర్లు బాగా ఆడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 450కి పైగా పరుగులు చేస్తేనే.. ఆశలు ఉంటాయి. గతంలోనూ ఇలాంటి పరిస్థితులను భారత్ చక్కగా ఎదుర్కొంది. 2001లో ఆస్ట్రేలియాపైనే విజయం సాధించింది. ఫాలోఆన్‌లో ద్రవిడ్, లక్ష్మణ్‌ పోరాటం అనంతరం బౌలర్లు చెలరేగిపోయి జట్టును గెలిపించారు. తాజాగా బంగ్లాపై టెస్టులోనూ అద్భుత విజయం సాధించింది’ అని ఆకాశ్ గుర్తుచేశాడు.

Also Read: IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్ట్.. టీమిండియాకు భారీ షాక్ తప్పదా?

‘న్యూజిలాండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసినంత మాత్రాన కంగారుపడక్కర్లేదు. ఇక రెండో ఇన్నింగ్స్‌ గురించి మాత్రమే ఆలోచించాలి. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ పేసర్లు రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ స్పిన్‌కు కచ్చితంగా సహకరిస్తుంది. కివీస్‌లో రవీంద్ర, అజాజ్‌, ఫిలిప్స్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని మనోళ్లు పరుగులు చేయాలి. 8వ నంబర్ ఆటగాడు కూడా సెంచరీ సాధించిన సందర్భాలు మన జట్టులో ఉన్నాయి. ఆర్ అశ్విన్‌ ఆరు శతకాలు బాదాడు. అందరూ ఆడితే కివీస్‌ ముందు మంచి లక్ష్యం ఉంచడం కష్టమేం కాదు’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

Exit mobile version