NTV Telugu Site icon

IND vs ENG: భారత్‌ బ్యాటింగ్‌ బాగా మెరుగుపడాల్సి ఉంది.. మాజీ ఆటగాడు వార్నింగ్‌!

Ashwin Team India

Ashwin Team India

Zaheer Khan on Team India Batting: భారత్‌ బ్యాటింగ్‌ బాగా మెరుగుపడాల్సి ఉందని టీమిండియా మాజీ ఆటగాడు జహీర్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ సత్తా చాటడం వల్లే జట్టు గెలిచిందని.. మిగతా టెస్టుల్లో సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో గెలిచిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన విశాఖలో బదులు తీర్చుకుంది. ఇక మూడో టెస్ట్ ఫిబ్రవరి 15న భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆరంభం కానుంది.

బ్యాటింగ్‌ ఆర్డర్‌ వైఫల్యం ప్రస్తుతం టీమిండియాకు అతిపెద్ద సమస్యగా కనిపిస్తోందని జహీర్‌ ఖాన్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. జియో సినిమా షోలో రెండో టెస్టులో భారత బ్యాటర్ల ఆట తీరును జహీర్‌ విశ్లేషించాడు. ‘సిరీస్‌లో ఒక మ్యాచ్‌ ఓడి వెనుకంజలో ఉన్నపుడు.. 1-1తో సమం చేయాలనే కసి, దూకుడు ఆటగాళ్లలో కనిపించాలి. ప్రతి ఒక్క ఆటగాడి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టేందుకు రోహిత్‌ శర్మ కృషి చేశాడు. అయితే మన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇలాంటి పిచ్‌ల మీద భారత బ్యాటర్లు ఇంతకంటే గొప్పగా బ్యాటింగ్‌ చేశారు. నిజానికి ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బ్యాటింగ్‌ చేసింది’ అని జహీర్‌ అన్నాడు.

Also Read: Sebastian Pinera Dead: హెలికాప్టర్‌ ప్రమాదం.. చిలీ మాజీ అధ్యక్షుడు మృతి!

‘భారత జట్టు బ్యాటింగ్‌ ఆందోళన కలిగిస్తోంది. విశాఖ పిచ్‌పై భారత బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాల్సింది. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను చూస్తే.. ఒకే అర్ధ సెంచరీ నమోదైంది. అయినా 300కు దగ్గరగా స్కోరు చేసింది. సమష్టిగా ఆడడమే ఇందుకు కారణం. భారత్‌ తరఫున యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ రాణించారు. కానీ మిగతా బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది’ అని జహీర్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. రెండో టెస్టులో జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ (209) చేయగా.. గిల్‌ సెంచరీ (104) చేశాడు.

Show comments