NTV Telugu Site icon

KS Bharat: రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు.. భరత్‌ రాణిస్తేనే భవిష్యత్తులో అవకాశాలు!

Ks Bharat Captain

Ks Bharat Captain

Sanjay Manjrekar on KS Bharat ahead of IND vs ENG 3rd Test: హైదరాబాద్, విశాఖలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో టీమిండియా వికెట్‌ కీపర్, తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ పెద్దగా రాణించలేదు. హైదరాబాద్ టెస్టులో (41, 28) కాస్త పోరాట పటిమ చూపించిన భరత్‌.. రెండో టెస్టులో (17, 6) విఫలం అయ్యాడు. భరత్ ఫామ్ మేనేజ్‌మెంట్‌ను కలవరానికి గురి చేస్తోంది. వికెట్ల వెనకాల బాగానే రాణిస్తున్నా.. బ్యాటింగ్‌తో నిరాశపరుస్తున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్‌ ఎవరూ లేకపోవడంతో.. భరత్‌ను టీమ్ మేనేజ్‌మెంట్‌ కొనసాగిస్తోంది. చివరి అవకాశంగా మూడో టెస్టులో ఛాన్స్ ఇవ్వనుంది.

ఇషాన్‌ కిషన్‌ రంజీల్లో బాగా ఆడి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం లేకపోలేదు. మరోవైపు కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ఐపీఎల్‌ 2024లో పంత్ కొన్ని మ్యాచ్‌లు ఆడతాడని ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ చెప్పాడు. ఈ సమయంలో కేఎస్ భరత్‌ రాణిస్తేనే.. భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్‌ మంజ్రేకర్ అంటున్నాడు. తదుపరి మ్యాచుల్లో భరత్‌ రాణించకపోతే.. ఇషాన్‌ వైపు మొగ్గు చూపడం ఉత్తమం అని అభిప్రాయపడ్డాడు.

Also Read: U19 World Cup 2024: సెమీ‌స్‌లో ఆస్ట్రేలియాపై ఓటమి.. మైదానంలో ఏడ్చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లు!

‘తొలి సిరీస్‌లో ఆడుతున్నాడని కేఎస్ భరత్‌ భావిస్తున్నాడేమో. ఇప్పటికే అతడు ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల్లో ఆడాడు. రిషబ్ పంత్‌ లేని సమయంలో జట్టులోకి వచ్చాడు. పెద్దగా రాణించని అతడిని కొనసాగించడంపై మేనేజ్‌మెంట్ ఇప్పటికే ఆలోచన చేసుంటుంది. భరత్‌ తదుపరి మ్యాచుల్లో రాణించకపోతే.. ఇషాన్‌ కిషన్‌ వైపు మొగ్గు చూపడం ఉత్తమం. ఆటగాళ్ల సామర్థ్యాలపై సెలక్టర్లకు నమ్మకం ఉండొచ్చు. అయితే వ్యక్తిగత ప్రదర్శన మెరుగ్గా ఉంటేనే జట్టులోకి తీసుకోవాలి. ఇప్పుడు పంత్‌ కోలుకుంటున్నాడు. తిరిగి జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో భరత్ బాగా కీపింగ్‌ చేసినా బ్యాటింగ్‌ చేయలేకపోతే.. అతడిని పక్కన పెట్టేయాల్సిందే. క్రికెట్‌లో కీపర్‌ బ్యాటింగ్‌లోనూ రాణించాలి. వచ్చే 3-5 ఏళ్లు పంత్ తప్పకుండా సక్సెస్ అవుతాడు’ అని సంజయ్‌ మంజ్రేకర్ పేర్కొన్నాడు.