Historical Wins Show Hope for India in Oval: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగుల లీడ్ సాధించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రెండు వికెట్స్ తీసి విజయం సాధించాలని చూస్తోంది. ప్రస్తుతం భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉన్నా.. మూడో రోజులో ఎన్ని పరుగులు చేస్తుందో అని ఫాన్స్ ఆందోళనలో ఉన్నారు. అయితే కంగారుపడాల్సిన అవసరం లేదని హిస్టరీ చెబుతోంది.
ఓవల్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఇచ్చినా.. గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా భారత్ కూడా రెండుసార్లు ఆతిథ్య ఇంగ్లండ్‌పై గెలుపొందింది. 1971లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులకే ఆలౌట్ అయిటీమిండియాకు 173 పరుగుల టార్గెట్‌ను విధించింది. లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. 2021లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 290 పరుగులు చేసి 99 పరుగుల లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 466 పరుగులు చేసి.. 368 పరుగుల లక్ష్యంను విధించింది. ఇంగ్లీష్ జట్టు 210 పరుగులకే ఆలౌట్ అయి ఓడిపోయింది.
ప్రస్తుత సిరీస్‌లో ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి 75/2 స్కోర్ చేసింది. ప్రస్తుతం భారత్ 52 పరుగులు ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించి క్రీజులో ఉన్నాడు. ఇంకా గిల్, నాయర్, జడేజా, జురెల్, సుందర్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో భారత్ ఈరోజు మొత్తం బ్యాటింగ్ చేస్తే భారీ లీడ్ సాధించొచ్చు. ఇంగ్లండ్ ఎదుట కనీసం 350 ప్లస్ టార్గెట్ ఉంచితే భారత్ గెలవడం పెద్ద కష్టమేం కాదు. రెండో రోజు భారత్ ప్రదర్శనపైనే ఫలితం ఆధారపడి ఉంది.
