Site icon NTV Telugu

India vs England: నీ లక్ష్యం సెంచరీలు చేయడమా?.. లేదా ప్రపంచకప్‌ను అందుకోవడమా?

Rohit

Rohit

Gautam Gambhir Hails Rohit Sharma’s Batting and Captaincy: వన్డే ప్రపంచకప్‌ 2023లో వరుసగా 6 మ్యాచులు గెలిచిన భారత్ సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో దూసుకుపోతుంది. బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ అద్భుత ఫామ్‌లో ఉండగా.. తామేం తక్కువ కాదని బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ నిరూపించారు. భారత్ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌, నాయకత్వ తీరు తననెంతో మంత్ర ముగ్ధుడిని చేసిందన్నారు. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో గెలిచింది.

‘సారథిగా జట్టులోని ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో.. వ్యక్తిగతంగా అదే ఆట తీరును ప్రదర్శించాలి. అప్పుడే జట్టును ఆత్మవిశ్వాసంతో ముందుండి నడిపించొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా పీఆర్‌ టీమ్‌లు, మార్కెటింగ్‌ ఏజెన్సీలు అవసరం లేదు. మన వ్యక్తిగత ప్రదర్శనను వారు ఏమీ చేయరు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ చేసింది ఇదే. ముందుగా జట్టుకు అవసరమైన సమయంలో క్రీజ్‌లో నిలబడి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రోహిత్ చేసిన 87 పరుగులు సెంచరీతో సమానం. ఇక రోహిత్ బౌలర్లను వినియోగించుకున్న తీరు అద్భుతం’ అని గౌతమ్ గంభీర్ అన్నారు.

Also Read: IND vs ENG: విరాట్ కోహ్లీని ట్రోల్‌ చేసిన ఇంగ్లండ్ ఫాన్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన భారత అభిమానులు!

‘అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ 5 లేదా 10 స్థానంలో ఉండొచ్చు. కానీ.. ప్రధాన లక్ష్యం మాత్రం నవంబర్ 19న టైటిల్‌ను గెలవడమే ఉండాలి. నీ లక్ష్యం సెంచరీ మీద సెంచరీలు చేయడమా? లేకపోతే ప్రపంచకప్‌ను అందుకోవడమా? అనేది నిర్ణయించుకోవాలి. ఒకవేళ నీ లక్ష్యం సెంచరీ చేయడమే అయితే అందుకోసమే ఆడు. ఒకవేళ ప్రపంచకప్‌ లక్ష్యమే అయితే నిస్వార్థ సారథిగా ఆడాలి. ఇప్పటివరకు రోహిత్ ఇదే మార్గంలో ఉన్నాడు. తప్పకుండా కప్ సాధిస్తాడనే నమ్మకం ఉంది’ అని గౌతమ్ గంభీర్‌ ధీమా వ్యక్తం చేశాడు.

Exit mobile version