Monty Panesar advising England team to tackle Virat Kohli: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియనషిప్ 2023-25 ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకం. అందుకే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే భారత గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం ఇంగ్లండ్‌కు పెనుసవాలుగా మారింది. చివరగా 2012లో భారత్‌లో ఇంగ్లీష్ జట్టు టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఆ దేశ మాజీ ప్లేయర్లు కీలక సూచనలు చేస్తున్నారు.
భారత ఆటగాళ్లపై మానసికంగా పైచేయి సాధించి.. వారి ఏకాగ్రతను దెబ్బతీయాలని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అంటున్నాడు. ముఖ్యంగా సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీని స్లెడ్జ్ చేయాలని, అతడి ఇగో హర్ట్ చేయాలని సూచించాడు. గత కొన్నేళ్లుగా భారత్ ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోతున్న విషయాన్ని పదేపదే గుర్తుచేయాలని పనేసర్ తెలిపాడు. ఇంగ్లండ్‌పై కోహ్లీకి మెరుగైన రికార్డు ఉన్న కారణంగానే పనేసర్ ఈ దుర్మార్గపు ఆలోచనలను తమ ఆటగాళ్లకు సూచించాడు. విరాట్ ఇంగ్లండ్‌పై 28 టెస్టుల్లో 1991 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.
Also Read: Cheteshwar Pujara: చెతేశ్వర్ పుజారా అరుదైన మైలురాయి!
ఓ జాతీయ మీడియాతో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ ఇగోతో మైండ్ గేమ్ ఆడండి. అతడిని మానసికంగా దెబ్బ కొట్టండి. టీమిండియా చోకర్స్ అంటూ.. స్లెడ్జింగ్ చేయండి. ఫైనల్స్‌లో ఓడిపోతారని పదేపదే అనండి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డే, టీ20 ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించాడని, భారత్ ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోతుందని గుర్తుచేయండి. మానసికంగా దెబ్బకొడితే కోహ్లీ ఏకాగ్రత కోల్పోయి వికెట్ పారేసుకుంటాడు’ అని చెప్పాడు. కోహ్లీని స్లెడ్జ్ చేయోద్దని, ఒకవేళ చేస్తే అతడు మరింత రెచ్చిపోతాడని పలువురు మాజీలు అంటుంటే.. మాంటీ మాత్రం అందుకు బిన్నంగా స్పందించాడు.