Shoaib Bashir replace Jack Leach for IND vs ENG 2nd Test: ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ వీసా సమస్య కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో లేని విషయం తెలిసిందే. బషీర్ ఇప్పుడు విశాఖలో జరిగే రెండో టెస్టుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు విశాఖ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం కావడంతో.. బషీర్ అరంగేట్రం ఖాయమే అని అందరూ భావిస్తున్నారు. ఇదే విషయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. భారత్‌తో రెండో టెస్టులో బషీర్ అరంగేట్రం చేస్తాడా? అనే ప్రశ్నకు స్టోక్స్ సమాధానం ఇచ్చాడు.
‘గాయం కారణంగా రెండో టెస్టులో జాక్ లీచ్ ఆడటం లేదు. దురదృష్టవశాత్తూ అతడి కాలు వాపు ఎక్కువగా ఉంది. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాక ఇలా జరగడం అందరిని నిరాశకు గురిచేసింది. షోయబ్ బషీర్ అరంగేట్రం గురించి ఇప్పుడే చెప్పలేను. ఒకవేళ అతడికి అవకాశం వస్తే.. దీనిని అద్భుతమైన టెస్టుగా మార్చేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే కెరీర్‌లో మొదటి టెస్టు ఒకసారి మాత్రమే ఆడతాం. వైజాగ్ పిచ్‌పై కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, వైస్ కెప్టెన్ ఓలీ పోప్‌తో చర్చించి తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటా. బషీర్‌ను కేవలం పర్యటన అనుభవం కోసమే భారత్‌కు తీసుకురాలేదు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే బషీర్‌ను తుది జట్టులోకి తీసుకుంటాం’ అని బెన్ స్టోక్స్ చెప్పాడు.
Also Read: Vizag Test: విశాఖ టెస్టు.. తెలుగు ఆటగాడిని సన్మానించనున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్!
‘షోయబ్ బషీర్ అబుదాబిలో మాతోనే శిక్షణ చేశాడు. అతడు తన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టులో చోటు సంపాదించాడు. బషీర్‌ది చిన్న వయస్సు, ఫస్ట్-క్లాస్ అనుభవం తక్కువైనప్పటికీ.. బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడు జట్టులో చేరగానే మా ప్లేయర్స్ చాలా సంతోషించారు. తదుపరి టెస్ట్ మ్యాచ్ కోసం అతడిని పరిగణలోకి తీసుకుంటాం’ అని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ తెలిపాడు. మెక్‌కలమ్ మాటలను బట్టి చూస్తే.. రెండో టెస్టులో బషీర్ ఆడే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో రెండో టెస్ట్ ఆరంభం కానుంది.