James Anderson Reacts to Sharing Trophy Name with Sachin Tendulkar: ఇంగ్లీష్ గడ్డపై ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీకి ‘పటౌడీ సిరీస్’ అనే పేరు ఉండేది. ఇటీవలే పటౌడీ పేరును ఇంగ్లండ్ బోర్డు రిటైర్ చేసి.. ‘అండర్సన్-టెండూల్కర్’ ట్రోఫీగా మార్చింది. భారత్‌లో తలపడితే ‘ఆంథోని డి మెల్లో’ ట్రోఫీని ఇచ్చేవారు. ఇక భారత్‌లో ఆడినా, ఇంగ్లండ్‌లో తలపడినా.. రెండు జట్ల మధ్య సిరీస్ విజేతకు అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఇవ్వనున్నారు. విజేత జట్టు కెప్టెన్‌కు ‘పటౌడీ మెడల్’ను అందిస్తారు. ట్రోఫీ పేరు మార్పుపై ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్ స్పందించాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు పక్కన తన పేరా అని అనిపిస్తోందని తెలిపాడు.
‘ఓ ట్రోఫీకి మన పేరు పెట్టడం పెద్ద విషయం. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ ఆటగాడి పక్కన నా పేరు ఉండడం ఇంకా పెద్ద మ్యాటర్. సచిన్ పక్కన నా పేరా? అని ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. సచిన్‌తో కలిసి ట్రోఫీని ఆవిష్కరించడం సంతోషంగా అనిపించింది. నా చిన్నప్పటి నుంచి సచిన్ ఆట చూశాను. ప్రత్యర్థిగా కూడా తలపడ్డాను. వికెట్ కూడా పడగొట్టాను. ఒక దేశ భారాన్ని తన కెరీర్ ఆసాంతం భుజస్కంధాలపై మోస్తూ రాణించిన గొప్ప ఆటగాడు సచిన్. సచిన్‌తో కలిసి ట్రోఫీలో భాగం కావడం పెద్ద గౌరవంగా భావిస్తున్నా’ అని జేమ్స్ అండర్సన్ చెప్పాడు.
Also Read: IND vs ENG: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. నితీశ్ రెడ్డి అవుట్!
సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు ఆడి 15921 పరుగులు చేశాడు. 51 సెంచరీలు బాదాడు. టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులతో పాటు అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ సొంతం. మరోవైపు 188 టెస్టులు ఆడిన జేమ్స్ అండర్సన్ 704 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్స్ తీసిన పేసర్ అండర్సనే. మాజీ స్పిన్నర్లు మురళీధరన్ (800), షేన్ వార్న్ (709) అండర్సన్ కంటే ముందున్నారు.
