Site icon NTV Telugu

IND vs AUS Final 2023: నేడు వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌.. మూడో టైటిల్‌పై భారత్ గురి!

Ind Vs Aus Toss

Ind Vs Aus Toss

IND vs AUS World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్‌ 2023 తుది సమరానికి రంగం సిద్ధమైంది. 45 రోజుల్లో 48 మ్యాచ్‌ల తర్వాత.. జగజ్జేతను తేల్చే ఫైనల్ పోరుకు సమయం వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్‌ 2023 ఫైనల్ ఆరంభం కానుంది. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో మూడో టైటిల్‌పై దృష్టి పెట్టిన భారత్.. ఫైనల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాపై గెలిచి 2003 ఫైనల్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా చూస్తోంది.

బలాబలాలు, ఫామ్‌ దృష్ట్యా భారత్‌ ఫేవరేట్‌గా కనిపిస్తుండగా.. నాకౌట్‌ మ్యాచ్‌లలో తమ ఆటను రెట్టింపు స్థాయికి తీసుకెళ్లే ఆస్ట్రేలియాను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఓ దశలో లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టే పరిస్థితి నుంచి ఏకంగా ఫైనల్ చేరింది. చివరి రెండు మ్యాచ్‌లలో ఆసీస్ ఆడిన తీరు అద్భుతం అనే చెప్పాలి. ఓటమి నుంచి గెలుపు బాట పట్టింది. ఇక భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో రోహిత్ సేన విజయంతో పైచేయి సాధించినా.. ఆరంభ దశలో ఆసీస్‌ పదునైన బౌలింగ్‌తో ఆధిపత్యం చూపించింది. హోరాహోరీగా సాగే ఈ పోరులో గెలిచి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచేది ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

ప్రపంచకప్‌ 2023లో ఆస్ట్రేలియాతో పోరును పక్కన పెడితే.. మిగతా మ్యాచ్‌ల్లో భారత్‌కు మంచి శుభారంభాలు దక్కాయి. రోహిత్‌ శర్మ మెరుపు ఆరంభాలతో ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బ తీసి జట్టును పైచేయిలో నిలిపాడు. ఆటగాళ్లందరూ సమష్టిగా రాణిస్తూ.. ప్రత్యర్థులు పోటీలో లేకుండా చేశారు. చాలా మ్యాచ్‌ల్లో ఒక ఇన్నింగ్స్‌ అయ్యేసరికే భారత్‌ గెలుపు దాదాపుగా ఖరారైపోయింది. బౌలింగ్‌లోనూ భారత్‌కు మంచి ఆరంభాలు దక్కాయి. ఫైనల్లో కూడా ఇలాగే ఆరంభంలో పైచేయి సాధించడం కీలకం.

Also Read: Weight loss Tips : పుదీనాను ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు తెలుసా?

ప్రపంచకప్‌ 2023లో కొన్ని మ్యాచ్‌ల్లో టాస్‌ కీలక పాత్ర పోషించింది. అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సార్లు రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఛేదనలోనే నెగ్గింది. ఆ మ్యాచ్‌లో మాదిరే ఫైనల్లోనూ టాస్‌ గెలిస్తే.. రోహిత్‌ బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. అయితే టోర్నీలో మెజారిటీ మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరుతో ఒత్తిడికి గురి చేసిన భారత్.. బ్యాటింగ్‌ చేసే అవకాశాన్నీ కొట్టి పారేయలేం.

Exit mobile version