NTV Telugu Site icon

Jasprit Bumrah: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన మహిళా కామెంటేటర్‌!

Isa Guha Jasprit Bumrah

Isa Guha Jasprit Bumrah

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో 8 వికెట్స్ పడగొట్టిన బుమ్రా.. రెండో టెస్టులో 4 వికెట్స్ తీశాడు. బ్రిస్బేన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. మిగతా బౌలర్లు విఫలమైన చోట ఆరు వికెట్స్ పడగొట్టిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, మహిళా కామెంటేటర్ ఇసా గుహ.. తాజాగా క్షమాపణలు చెప్పారు.

జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించే క్రమంలో ‘మోస్ట్‌ వాల్యుబుల్ ప్రిమేట్’ అనే పదంను ఇసా గుహ వాడారు. అది చింపాజీ క్యారెక్టర్‌తో వచ్చిన ఇంగ్లీష్ కామెడీ మూవీ. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆట ప్రారంభ సమయంలో బుమ్రాకు ఇసా గుహ క్షమాపణలు చెప్పారు. ‘నిన్న నేను ఓ పదం వాడాను. అది విమర్శలకు దారితీసింది. ఆ పదం ఎవరినైనా బాధిస్తే.. నన్ను క్షమించండి. ఇతరుల గౌరవానికి భంగం కలిగించే విధంగా నేను ఎప్పుడూ నడుచుకోను. నేను మాట్లాడిన మొత్తం మాటలు వింటే.. బుమ్రాపై ప్రశంసలు కురిపించానని తెలుస్తుంది’ అని ఇసా గుహ తెలిపారు.

‘భారత గొప్ప ఆటగాళ్లను నేను ఎప్పుడూ తక్కువ చేయను. క్రికెట్‌ కోసం శ్రమించే వారి కోసం ఎప్పుడూ ముందుంటా. జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసించే క్రమంలో పొరపాటు పదంను వాడానని అనుకుంటున్నా. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. దక్షిణ ఆసియా వ్యక్తిగా నేనెలాంటి దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని అభిమానులు భావిస్తారనుకుంటా. అద్భుత టెస్టు మ్యాచ్‌కు ఇలాంటి వ్యాఖ్యలు నష్టం చేయవు’ అని ఇసా గుహ చెప్పుకొచ్చారు. ఇసా గుహ వివరణతో ఫాన్స్ కాస్త శాంతించారు.

Show comments