NTV Telugu Site icon

Nitish Kumar Reddy: నాకోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశారు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం: నితీశ్ రెడ్డి

Nitish Kumar Reddy Debut Test

Nitish Kumar Reddy Debut Test

తన కోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశారని, తాను ఇప్పుడు క్రికెటర్‌గా మారేందుకు ఆయన త్యాగాలే కారణం అని తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌ రెడ్డి తెలిపాడు. ఆర్థిక సమస్యల కారణంగా తాము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం అని, ఒక రోజు నాన్న ఏడవడం కూడా చూశానని చెప్పాడు. ఇప్పుడు ఓ కుమారుడిగా నాన్నను సంతోషంగా ఉంచుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నా అని, తన తొలి జెర్సీని ఆయనకే ఇచ్చానని నితీశ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరఫున సత్తాచాటిన నితీశ్.. భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇటీవల నితీశ్‌ రెడ్డి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రెండో టీ20లో 34 బంతుల్లోనే 74 రన్స్ చేయడంతో పాటు 2 వికెట్లూ కూడా తీసి ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకున్నాడు. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25 పర్యటన నేపథ్యంలో దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు బీసీసీఐ సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. భవిష్యత్‌ ఆల్‌రౌండర్‌గా నితీశ్‌ను పరిగణిస్తున్న బీసీసీఐ.. పెర్త్ టెస్టులో చోటు కల్పించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150 పరుగులకే ఆలౌట్ కాగా.. నితీశ్‌ (41) చేసిన పరుగులే అత్యధికం. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి 27 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అంతేకాదు ఓ వికెట్టూ పడగొట్టాడు.

Also Read: IND vs AUS: టాస్ గెలిచిన రోహిత్.. మూడు మార్పులతో బరిలోకి భారత్! తుది జట్లు ఇవే

అడిలైడ్‌ వేదికగా పింక్‌ బాల్ (డే/నైట్) టెస్ట్ మ్యాచ్‌ ఈరోజు ఆరంభం అయింది. ఈ టెస్టుకు ముందు కుటుంబ సభ్యుల గురించి నితీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు క్రికెట్‌ను పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. మా నాన్న నాకోసం జాబ్ వదిలేశారు. నేను ఇప్పుడు క్రికెటర్‌గా మారేందుకు ఆయన త్యాగాలే కారణం. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఒక రోజు నాన్న ఏడవడం చూశా. చాలా బాధగా అనిపించింది. అప్పటి నుంచే నేను క్రికెట్‌ను సీరియస్‌గా దృష్టిపెట్టా. మేం ఎదుర్కొన్న కష్టాలు, నాన్న త్యాగం ముందు నా శ్రమ చాలా తక్కువ. ఎంతో కష్టపడ్డాను. అందుకు ప్రతిఫలం దక్కింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ కుమారుడిగా.. ఇప్పుడు నాన్నను సంతోషంగా ఉంచుతున్నందుకు గర్వపడుతున్నా. నా మొదటి ఇండియా జెర్సీని ఆయనకే ఇచ్చా. నాన్న ముఖంలో కనిపించిన ఆనందాన్ని ఎప్పటికీ మరిచిపోలేను’ అని నితీశ్ తెలిపాడు.