NTV Telugu Site icon

IND vs NZ: టీమిండియాకు షాక్.. మూడో టెస్టుకు స్టార్ బ్యాటర్ దూరం?

Team India Test

Team India Test

న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఓడిన భారత్ ఇప్పటికే సిరీస్ కోల్పోయింది. నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు ఆరంభం కానుంది. చివరి టెస్టులో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా చూస్తోంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు తుది జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశముంది. రెండో టెస్టులో మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

టాప్‌-4ను భారత్‌ కొనసాగించనుంది. కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీలను కదిలించకపోవచ్చు. రోహిత్, గిల్ పర్వాలేదనిపించినా.. యశస్వి, కోహ్లీ నిరాశపరుస్తున్నారు. ఈ ఇద్దరు మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. సర్ఫరాజ్ ఖాన్ మరోసారి చెలరేగాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇక మోకాలి గాయంతో ఇబ్బందిపడుతోన్న స్టార్ బ్యాటర్‌ రిషబ్ పంత్‌ మూడో టెస్టుకు దూరం కానున్నాడు. పంత్‌కు విశ్రాంతినిచ్చి ధ్రువ్‌ జురెల్‌ను ఆడించవచ్చు.

వాంఖడే స్పిన్‌కు అనుకూల పిచ్‌ కావడంతో స్పిన్‌ త్రయం వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను భారత్‌ కొనసాగించనుంది. జడేజాకు విశ్రాంతి ఇచ్చి.. అతడి స్థానంలో అక్షర్‌ పటేల్‌ను బరిలోకి దింపాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపించని పేసర్ మహ్మద్ సిరాజ్‌ను రెండో టెస్టుకు పక్కన పెట్టిన విషయం తెలిసిందే. మూడో మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చి.. సిరాజ్‌ను తీసుకుంటారని సమాచారం.

Show comments