NTV Telugu Site icon

6 Balls 6 Fours: ఒకే ఓవర్ లో ఆరు ఫోర్లు కొట్టిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..

6 Balls 6 Fours

6 Balls 6 Fours

6 Balls 6 Fours In International Cricket: ఈ మధ్య క్రికెట్ ఆటలో బ్యాటింగ్ గతంలో కంటే తేలికగా మారింది. ఇప్పుడు వన్డే క్రికెట్‌లో 400 పరుగులు, 20 ఓవర్ల క్రికెట్‌లో 240కి పైగా పరుగులు చేయడం అలవాటుగా మారింది కొన్ని జట్లకు. ప్లేయింగ్ పిచ్ ఇప్పుడు ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్‌ లకు అనుకూలంగా ఉంటుంది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మెన్ 1 ఓవర్‌లో 6 ఫోర్లు కొట్టారన్న సంగతి మీకు తెలుసా..? ఇలా ఇప్పటివరకు 6 సార్లు ఇలా జరిగింది అంటే నమ్మండి. మరి ఎప్పుడు ఏ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం..

సందీప్ పాటిల్:

1982లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. రెండో టెస్టులో సందీప్ పాటిల్ 129* పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, ఇంగ్లండ్ బౌలర్ బాబ్ విల్స్ వేసిన ఓవర్లో అతను 6 ఫోర్లు వరుసగా బాదాడు. ఓవర్‌ లోని ఒక బంతి డాట్‌గా ఉంది. కానీ, ఒక నో బాల్ కారణంగా ఓవర్‌లో 7 బంతులు వేయబడ్డాయి. ఈ మ్యాచ్‌లో సందీప్ 169 బంతుల్లో 128 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

క్రిస్ గేల్:

వరుసగా 6 బంతుల్లో 6 ఫోర్లు కొట్టిన ఫీట్ వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ కూడా ఉన్నాడు. 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో అతను ఈ ఘనత సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాథ్యూ హాగార్డ్‌ కి గేల్ వరుసగా 6 ఫోర్లు బాదాడు. ఆ మ్యాచ్ లో గేల్ 87 బంతుల్లో 105 పరుగులు చేసాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

రాంనరేష్ శర్వాన్:

వెస్టిండీస్‌కు చెందిన మరో మాజీ లెజెండరీ బ్యాట్స్‌మెన్ రామ్‌నరేష్ శర్వాన్ కూడా ఈ ఘనత సాధించాడు. అతను 2006 సంవత్సరంలో భారత జట్టుపై ఈ ఫీట్ సాధించాడు. మునాఫ్ పటేల్ బౌలింగ్ లో 6 ఫోర్లు కొట్టాడు. సిరీస్‌ లోని మూడో టెస్టులో శర్వాన్ ఆ ఇన్నింగ్స్‌లో 174 బంతులు ఎదుర్కొని 116 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

సనత్ జయసూర్య:

2007లో శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ వెటరన్ బ్యాట్స్‌మెన్ సనత్ జయసూర్య జేమ్స్ అండర్సన్‌ పై 6 బంతుల్లో 6 ఫోర్లు కొట్టాడు. ఈ మ్యాచ్ క్యాండీలో జరిగింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో జయసూర్య 106 బంతులు ఎదుర్కొని 78 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక 88 పరుగుల తేడాతో విజయం సాధించింది.

హ్యారీ బ్రూక్:

2022లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై హ్యారీ బ్రూక్ ఈ ఘనత సాధించాడు. తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్‌ బౌలింగ్ లో 6 బంతుల్లో 6 ఫోర్లు బాదాడు. ఆ ఇన్నింగ్స్‌లో బ్రూక్ 116 బంతులు ఎదుర్కొని 153 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తిలకరత్నే దిల్షాన్:

వన్డేల్లో ఇలా ఒక్కసారి మాత్రమే జరిగింది. 2015 వన్డే ప్రపంచకప్‌లో, శ్రీలంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన మిచెల్ జాన్సన్‌ బౌలింగ్ లో వరుసగా 6 బంతుల్లో 6 ఫోర్లు కొట్టాడు.