Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!

Bear Kills Siblings

Bear Kills Siblings

Bear Kills Siblings: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఆడ ఎలుగుబంటి తన పిల్ల చనిపోవడంతో తీవ్ర ఆవేదన, ఆగ్రహంలో ఇద్దరు అన్నాచెల్లెళ్లపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడగా.. ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఈ విషాద అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్హర్‌పూర్ అటవీ పరిధిలోని లర్‌గావ్–మర్కటోలా ప్రాంతంలో బుధవారం ఉదయం ఓ రైతు తన ఎద్దులను మేపేందుకు పొలానికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఆడ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. అతడు ఎలుగుబంటితో పోరాడుతుండగా అతని సోదరి అతడిని రక్షించేందుకు పరుగెత్తుకుని వచ్చింది. అయితే ఎలుగుబంటి ఆమెపై కూడా దాడి చేయడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది.

మరోవైపు గ్రామస్తుల కథనం ప్రకారం.. ఎలుగుబంటి పిల్ల ఒకటి మంగళవారం నాడు చనిపోయింది. ఆ పిల్ల మృతదేహం పక్కనే తల్లి ఎలుగుబంటి రాత్రంతా కాపలా కాసింది. ఆ తర్వాత అటవీ శాఖ సిబ్బంది పిల్ల మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించారు. దీంతో మరింత ఆందోళనకు గురైన ఆడ ఎలుగుబంటి తీవ్ర ఆగ్రహంతో వ్యవహరించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతం సమీపంలోనే ఓ పాఠశాల కూడా ఉండటంతో విద్యార్థులు, గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఆశారామ్ నేతమ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే ఎలుగుబంటి మృతదేహాల వద్దే కూర్చొని వాటిని వదిలిపెట్టకుండా ఉండటంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు ప్రత్యేక బృందం ఎలుగుబంటికి మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకుంది. ఎలుగుబంటి స్పృహ కోల్పోయిన అనంతరం అటవీశాఖ సిబ్బంది దానిని తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు కర్రలు, దుడ్డుకర్రలతో స్పృహ తప్పిన ఎలుగుబంటిపై దాడికి దిగారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా గ్రామస్తులను అదుపు చేయడం కష్టమైంది. ఆ తర్వాత అధికారులు ఎలుగుబంటిని, మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు.

తీవ్రంగా గాయపడిన మహిళను మొదట స్థానిక ఆస్పత్రికి తరలించి, పరిస్థితి విషమంగా ఉండటంతో రాయ్‌పూర్‌కు రిఫర్ చేశారు. మరోవైపు మృతుల కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించింది. అవసరమైన ప్రక్రియ పూర్తయ్యాక మిగిలిన పరిహారం కూడా అందజేస్తామని అటవీశాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తెలిపారు.