NTV Telugu Site icon

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ఇప్పటి వరకు ఎవరెన్నిసార్లు టైటిల్ గెలుచుకున్నారంటే

Border Gavaskar Trophy

Border Gavaskar Trophy

Border Gavaskar Trophy: నవంబర్ 22 నుంచి భారత్ – ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కింద ఇరు జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో తొలి మ్యాచ్ పెర్త్ క్రికెట్ స్టేడియంలో, రెండో మ్యాచ్ అడిలైడ్‌లో, మూడో టెస్టు బ్రిస్బేన్‌లో, నాలుగో టెస్టు మెల్‌బోర్న్‌లో, చివరి మ్యాచ్ సిడ్నీలో జరగనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్ర నిజానికి చాలా పాతది. 1947 నుండి 1992 వరకు భారతదేశం – ఆస్ట్రేలియా మధ్య 50 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. 1996లో రెండు క్రికెట్ బోర్డులు కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, క్రికెట్ ఆస్ట్రేలియాలు లెజెండరీ టీమిండియా ఆటగాడు సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా ఆటగాడు అలన్ బోర్డర్ సాధించిన విజయాలను గౌరవించేందుకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రవేశపెట్టాయి. బోర్డర్, గవాస్కర్ తమ తమ జట్ల కోసం టెస్ట్ క్రికెట్‌లో 10 వేల పరుగులు చేసిన మొదటి క్రికెటర్లు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కింద ఇప్పటివరకు 16 సిరీస్‌లు జరిగాయి. వీటిలో భారతదేశంలో 9 సార్లు, ఆస్ట్రేలియాలో 7 సార్లు నిర్వహించబడింది. భారత్ 10 సిరీస్‌లు గెలుచుకోగా, ఆస్ట్రేలియా 5 సిరీస్‌లను గెలుచుకుంది. 2003–04 సిరీస్‌ మాత్రమే డ్రా అయింది. ఆ సమయంలో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించింది. 1996 నుంచి ఇప్పటి వరకు ఆడిన 57 టెస్టుల్లో భారత్ 24, ఆస్ట్రేలియా 21 విజయాలు సాధించగా, 12 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియా చివరిసారిగా 2014లో టెస్టు సిరీస్‌లో భారత్‌ను ఓడించింది. అప్పటి నుండి, భారత్ 4 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను గెలుచుకుంది. 2017లో స్వదేశంలో భారత్ 2-1తో ఆస్ట్రేలియాను ఓడించింది. దీని తర్వాత 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2020-21లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ మళ్లీ సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరిసారిగా 2023లో భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సంబంధించి రికార్డ్స్ చూస్తే.. ఈ ట్రోఫీలో భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగా రికార్డ్ క్రియేట్ చేసాడు. 34 మ్యాచ్‌ల్లో 65 ఇన్నింగ్స్‌ల్లో 56.24 సగటుతో 3,262 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 241* పరుగులు. అలాగే రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా తరపున 29 మ్యాచ్‌లు ఆడాడు. 54.36 సగటుతో 51 ఇన్నింగ్స్‌లలో 2,555 పరుగులు చేశాడు. 8 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 257 పరుగులు. నాథన్ లియాన్ ఈ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 26 మ్యాచ్‌ల్లో 32.40 సగటుతో 116 వికెట్లు తీశాడు. అతను 3 సార్లు 4 వికెట్లు, 9 సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 8/50. కాగా, భారత్‌ నుంచి రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్థానంలో నిలిచాడు. 22 మ్యాచ్‌ల్లో 28.36 సగటుతో 114 వికెట్లు తీశాడు. అతను తన పేరిట 7 సార్లు 5 వికెట్లు సాధించాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 7/103.