Site icon NTV Telugu

Rain Alert: తెలంగాణకు చల్లని కబురు.. గుడ్‌న్యూస్ చెప్పిన వాతావరణశాఖ

Rain

Rain

గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భానుడు భగభగమండిపోతున్నాడు. తీవ్రమైన వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే సుర్యుడు సుర్రు మంటున్నాడు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇక చిన్నారులు, వృద్ధులైతే ఉక్కపోతతో బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది.

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వచ్చే మూడు రోజులు వేడిగాలుల నుంచి ఉపశమనం పొందవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హైదరాబాద్‌ తెలిపింది.

ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడకక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు దాదాపుగా మూడు రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఏప్రిల్ 8న ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. మంగళవారం కామారెడ్డిలో వర్షం కురవొచ్చని వెల్లడించింది. వివిధ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్‌లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది. కాకపోతే హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్సుందని వెల్లడించింది. గురువారం హైదరాబాద్‌లోని గోల్కొండలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండలో 43.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే ఆయా జిల్లాల్లో మాత్రం మూడు రోజుల పాటు వేడి గాలుల నుంచి ఉపశమనం పొందే ఛాన్సు ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనూ వర్షాలు
అలాగే ఏప్రిల్ 7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. అలాగే ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Exit mobile version