Chegunta: మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివునూరు గ్రామస్తులు దీపావళి నుంచి భయాందోళనలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. పండగరోజు నుంచి 70మందికి పైగా గ్రామస్తులకు వాంతు, విరేచనాలు అవుతున్నాయి. దాంతో వారిని చేగుంట ప్రాథమిక ఆస్పత్రిల్లో చేర్పించారు కుటుంబీకులు. 70మంది ఆస్పత్రిలో చేరడంతో రోగులతో కిటకిటలాడుతోంది. సీరియస్ గా ఉన్న వారికి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదులోని కార్పోరేట్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అనంతరం చేగుంట పీహెచ్ సీ సిబ్బంది ఆ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. చేగుంట పీహెచ్సీ డాక్టర్ పుష్పలత, వైద్యసిబ్బంది రోగులకు నిరంతర వైద్య సాయం అందజేస్తున్నారు. కొంత మంది తుప్రాన్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తులకు వాంతులకు, విరేచనాలకు గల కారణాలు తెలియరాలేదు.
ఇది ఇలా ఉండగా వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురై మల్లమ్మ(60) అనే మహిళ చనిపోయింది. ఆమె సిద్ధిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. వారం పాటు చికిత్స తీసుకున్నా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. పలువుగు గత వారం రోజులుగా ఆస్పత్రులకే పరిమితమయ్యారు. అస్వస్థతతో మరణించిన వారి సంఖ్య రెండుకు చేరుకుంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇంతవరకు వారి అస్వస్థతకు కారణాలు తెలియడం లేదు. అస్వస్థతకు గురై పీహెచ్సీలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పెద్దశివునూర్ గ్రామంలో చికిత్స పొందుతున్న వారితో పాటు పలు చోట్ల ఆయా దవాఖానాల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.