ఐఐటీల్లో విద్యార్థుల అభ్యాస వేగంలో తేడాలను, విభిన్న నేపథ్యాలను దృష్టిలో ఉంచుకుని ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్, బిట్స్ పిలానీ క్యాంపస్ గ్రూప్ వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు కీలక ప్రతిపాదన చేశారు. ఐఐటీలలో ప్రస్తుతం అమలవుతున్న ఒకే రకమైన విధానం విద్యార్థులకు సరిపోదని, దీనికి ప్రత్యామ్నాయంగా ఐదేళ్ల బీటెక్ కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఐఐటీ బాంబేలో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లకు సంబంధించిన ఇటీవలి వివాదంపై స్పందిస్తూ ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
ప్రస్తుతం కోచింగ్ కల్చర్ ద్వారా వచ్చే విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఒకే గదిలో చదువుతున్నారని, వీరందరి అభ్యాస వేగం ఒకేలా ఉండదని రాంగోపాల్ రావు పేర్కొన్నారు. ఐఐటీలలోని తరగతి గదులు భిన్నమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయని, సింగిల్ డిజిట్ నుంచి ఫైవ్ డిజిట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఒకే క్లాస్‌లో ఉంటున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఒకే వేగంతో నేర్చుకోవాలని ఆశించడం సరికాదని, బోధనా పద్ధతుల్లో మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సమస్యకు పరిష్కారంగా ఐఐటీలలో ఐదేళ్ల బీటెక్ కార్యక్రమాన్ని తీసుకొస్తే బాగుంటుందని ఆయన ప్రతిపాదించారు. ఈ కొత్త విధానం ద్వారా విద్యార్థులు తమ క్రెడిట్ అవసరాలను బట్టి నాలుగు సంవత్సరాలలో లేదా మూడున్నర సంవత్సరాలలో కూడా కోర్సు పూర్తి చేయవచ్చు. అవసరమైన విద్యార్థులు మాత్రం తమ కోర్సును ఐదేళ్లకు పొడిగించుకోవచ్చని, దీనివల్ల రికార్డెడ్ లెక్చర్లు, ఆన్‌లైన్ మెటీరియల్, భాషా పరమైన అదనపు సహాయం పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
అందరికీ వర్తించేలా ఐదేళ్ల ప్రోగ్రామ్‌గా దీనిని అమలు చేయడం వల్ల విద్యార్థులలో ఎలాంటి మానసిక ఒత్తిడి లేదా వివక్ష అనే భావన ఉండదని ఆయన స్పష్టం చేశారు. త్వరగా కోర్సు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నవారు త్వరగా ముగించవచ్చని, అదనపు సమయం కావాల్సిన వారు ఎలాంటి మొహమాటం లేకుండా ఐదో సంవత్సరాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. విద్యా ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకుండా, విద్యార్థులకు తగిన సమయం అందించడం విద్యా వ్యవస్థ బాధ్యత అని రాంగోపాల్ రావు చెప్పారు.

