One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..

Ignou

Ignou

ఇగ్నో జూలై 2026 విద్యా సంవత్సరం నుంచి డెవలప్‌మెంట్ స్టడీస్ (Development Studies) విభాగంలో ఒక సంవత్సర కాలపరిమితితో నూతన ఎంఏ కార్యక్రమాన్ని ప్రకటించింది. సాధారణంగా మాస్టర్ డిగ్రీకి రెండేళ్లు పడుతుంది కానీ, ఈ కోర్సు పన్నెండు నెలల్లోనే పూర్తవుతుంది. ఇగ్నోలోని స్కూల్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్ రూపొందించిన ఈ కోర్సు మొత్తం 40 క్రెడిట్‌లతో ఉంటుంది. ఏదైనా విభాగంలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసినవారు, లేదా వ్యవసాయం, సంబంధిత రంగాల్లో 4-5 ఏళ్ల డిగ్రీ ఉన్నవారు, అలాగే 4 ఏళ్ల బీఈడీ లేదా బీటెక్ చేసినవారు దీనికి అర్హులు.

ఈ కోర్సు రెండు సెమిస్టర్లలో 20-20 క్రెడిట్ల చొప్పున మొత్తం 40 క్రెడిట్లతో ఉంటుంది. మొదటి సెమిస్టర్‌లో అభివృద్ధి ప్రాథమిక సిద్ధాంతాలు, ప్రస్తుత అంశాలు, గతిశీలత, సవాళ్లు నేర్పుతారు. రెండో సెమిస్టర్‌లో రీసెర్చ్ మెథడాలజీ తప్పనిసరిగా ఉండి, జెండర్ స్టడీస్, ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్, ట్రైనింగ్, లోకల్ సెల్ గవర్నెన్స్, హెల్త్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అర్బన్ డెవలప్‌మెంట్ వంటి ఆప్షనల్ సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. కేవలం సిద్ధాంతమే కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలకు కూడా పెద్దపీట వేయడంతో ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీఓలు, సీఎస్‌ఆర్ ప్రాజెక్టుల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.

ఈ ఒక ఏడాది ఎంఏ కోర్సు మొత్తం ఫీజు కేవలం రూ.8,000 మాత్రమే. జూలై 2026 సెషన్ కోసం ఆన్‌లైన్ ప్రవేశ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇగ్నో జనవరి, జూలై సెషన్లలో ప్రవేశాలు కల్పిస్తుంది కాబట్టి తక్కువ ఖర్చులో త్వరగా మాస్టర్ డిగ్రీ చేయాలనుకునే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. పూర్తి వివరాలకు https://www.ignou.ac.in/ సందర్శించవచ్చు.