NTV Telugu Site icon

IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్ట్.. టీమిండియాకు భారీ షాక్ తప్పదా?

Rishabh Pant Injury

Rishabh Pant Injury

Rishabh Pant Injury: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. టీమిండియా బ్యాటర్లు విఫలమైన అదే పిచ్‌పై.. కివీస్ బ్యాటర్లు అదరగొడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 7 వికెట్స్ కోల్పోయి 281 రన్స్ చేసింది. డెవాన్‌ కాన్వే (91; 105 బంతుల్లో 11×4, 3×6), రచిన్‌ రవీంద్ర (76; 110 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీలు బాదారు. రవీంద్ర జడేజా 3 వికెట్స్ పడగొట్టాడు. తొలి టెస్టు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ చేయాల్సి ఉంది. అయితే రోహిత్ సేనకు భారీ షాక్ తప్పేలా లేదు.

స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ రెండో రోజు వికెట్ కీపింగ్‌ చేస్తూ గాయపడి మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే. ఆర్ జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 37వ ఓవర్‌ చివరి బంతి తక్కువ ఎత్తులో వచ్చి పంత్‌ కుడి మోకాలికి తగిలింది. నొప్పితో విలవిల్లాడి మైదానంలోనే కుప్పకూలాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినా.. ఫలితం లేకపోయింది. మూడోరోజైన శుక్రవారం పంత్ వికెట్ కీపింగ్‌కు రాలేదు. ధ్రువ్ జురెల్ కీపింగ్‌ను కొనసాగిస్తున్నాడు. పంత్ మైదానంలోకి రాకపోవడంతో అతడి గాయంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే పంత్ గాయంపై స్పందించిన బీసీసీఐ.. వైద్య బృందం నిరంతరం అతడిని పర్యవేక్షిస్తోందని, మళ్లీ మైదానంలోకి దిగేందుకు కృషి చేస్తోందని తెలిపింది.

Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి షాక్.. 79 వేలకు చేరుకున్న బంగారం ధర! ఇక తగ్గేదేలే

తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ టాప్‌ స్కోరర్. టీమిండియా చేసిన 46 పరుగుల్లో పంత్ చేసినవే 20 రన్స్ ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు సాధించాలంటే.. పంత్ కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడే పంత్.. ఒకవేళ బ్యాటింగ్‌కు దిగకపోతే నష్టమే. అప్పుడు భారత్‌కు షాక్ తప్పదు. గాయం అయినా జట్టు కోసం పంత్ మైదానంలోకి వస్తాడో లేదో చూడాలి.