Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!

Murder

Murder

Sangareddy: గత నెల 30న సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ వివాహిత హత్య జరిగింది. ఈ కేసును తాజాగా పోలీసులు ఛేదించారు. మొదట భర్త అనిల్ కుమార్ సాహ్, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు భార్యను అపహరించి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఆర్సీ పురం డివిజన్, SOT బృందాలు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. విచారణలో భర్త అనిల్ కుమార్ సాహ్‌నే హత్యకు సూత్రధారి అని తేలింది.

అసలు ఏం జరిగిందంటే..?

బీహార్‌కు చెందిన అనిల్‌కుమార్, మీనాదేవి (35) దంపతులు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వెంకటేశ్వర కాలనీలో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. భార్య తన సంపాదనను తల్లిదండ్రులకు పంపిస్తోందనే కోపంతో పాటు కుటుంబ విభేదాల కారణంగా హత్యకు కుట్ర పన్నాడు అనిల్ కుమార్. భార్యను హత్య చేయడానికి బీహార్‌కు చెందిన నేరస్థుడు రింకు కుమార్‌కు రూ.2 లక్షల సుపారీ ఇచ్చాడు. రింకు కుమార్ తన అనుచరులు రంజన్, నీరజ్‌లతో కలిసి హైదరాబాద్ వచ్చి హత్యకు ప్రణాళిక రూపొందించాడు. మే 30 రాత్రి పథకం ప్రకారం మీనా దేవిని గొంతు కోసి హత్య చేశారు. హత్య అనంతరం బాధితురాలి భర్త తనపై కూడా దాడి జరిగినట్లు నాటకం ఆడి పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. తన చేతులు, వీపుపై స్వల్ప గాయాలు చేసుకుని దుండగులతో పోరాడినట్లు కథ అల్లాడు. నిందితుడు రంజన్‌ను బీహార్‌లోని వెస్ట్ చంపారన్ జిల్లా చన్‌పటియా ప్రాంతంలో అరెస్టు చేశారు. విచారణలో భర్తే ఇదంతా చేయించాడని తెలిసింది. దీంతో భర్త అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రింకు కుమార్, మరో నిందితుడు నీరజ్ కోసం గాలిస్తున్నారు. రింకు కుమార్‌పై ఇప్పటికే బీహార్, పంజాబ్, హర్యానాల్లో గంజాయి, మద్యం అక్రమ రవాణా, కిడ్నాప్ తదితర కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

×
×
Ad

ఈ కేసు వివరాలను శేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించారు. “ఐడీఏ బొల్లారంలో మహిళ హత్య కేసు పోలీసులు ఛేదించాం. గండి గూడం శివారులో మే 30న మీనాదేవి హత్య జరిగింది. భార్య అపహరణ, హత్య చేశారంటూ భర్త ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తుకు 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశాం. భర్త అనిల్ కుమార్ ఏ హత్య సూత్రధారి అని తేల్చాం. కుటుంబ విభేదాలు, డబ్బుల వ్యవహారమే దేవీ హత్యకు కారణం. భార్య సంపాదన తన తల్లి దండ్రులకు పంపుతుందనే కోపంతో హత్యకు కుట్ర పన్నాడు. బీహార్‌కు చెందిన రింకు కుమార్‌కు రూ.2 లక్షల సుపారీ ఇచ్చాడు. రింకు కుమార్, రంజన్, నీరజ్‌లతో కలిసి హత్యకు ప్లాన్ చేశారు. మే 30 రాత్రి మీనా దేవిని గొంతు కోసి హత్య చేశారు. హత్య తర్వాత తనపై దాడి జరిగిందంటూ భర్త డ్రామా ఆడాడు. చేతులు, వీపుపై గాయాలు చేసుకుని పోలీసులను తప్పుదారి పట్టించే యత్నం చేశాడు. బీహార్‌లో రంజన్ అరెస్ట్ చేశాం. భర్త అనిల్ కుమార్‌ను సైతం అరెస్ట్ చేశాం. ప్రధాన నిందితుడు రింకు కుమార్, నీరజ్ పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకుంటాం. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చేపట్టాం. రింకు కుమార్‌పై పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయి.” అని డీసీపీ వెల్లడించారు.