Ashish Sakharkar Passes Away: బాడీబిల్డింగ్ ప్రపంచంలో ఆశిష్ సఖార్కర్ గురించి తెలియని వారు ఉండరు. మిస్టర్ ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫోరమ్‌లలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న ఆశిష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ లెజెండరీ బాడీబిల్డర్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్నారు. ముంబైలో నివసిస్తున్న ఆశిష్ సఖార్కర్ బాడీబిల్డింగ్ ప్రపంచంలో గొప్ప స్థాయికి ఎదిగిన బాడీబిల్డర్‌లలో ఒకరు. దేశ విదేశాల్లో ఎన్నో పోటీల్లో గెలుపొంది భారతదేశంలో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నాడు. మిస్టర్ మహారాష్ట్ర నుంచి మిస్టర్ ఇండియా, మిస్టర్ యూనివర్స్ వరకు ఎన్నో టైటిల్స్, మెడల్స్ సాధించాడు.
ఆశిష్ సఖార్కర్ బాడీబిల్డింగ్ రంగంలో మహారాష్ట్రలోనే కాకుండా భారతదేశం అంతటా ఒక ఐకాన్‌గా పరిగణించబడ్డాడు. ఆయన మిస్టర్ ఇండియాలో నాలుగుసార్లు, ఫెడరేషన్ కప్ నాలుగుసార్లు, మిస్టర్ యూనివర్స్, యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని కూడా సాధించాడు. ఆయనకు మహారాష్ట్ర అత్యున్నత క్రీడా పురస్కారం శివ్ ఛత్రపతి అవార్డు లభించింది. అయితే కొద్దిరోజుల క్రితం ఆశిష్ సకార్కర్ అస్వస్థతకు గురయ్యాడు. దీని తర్వాత చికిత్స పొందుతున్నాడు. ఎంత చేసినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు. ఆశిష్ కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆశిష్ సకార్కర్ అభిమానులు, స్నేహితులు, బంధువులు, ఆయన మృతిపట్ల సంతాపాన్ని తెలియజేశారు.
