Credit Card Rule Changes: ఆ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!

Credit Card

Credit Card

Credit Card Rule Changes: క్రెడిట్‌ కార్డు రూల్స్‌ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి.. అయితే, మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ముఖ్యమైన వార్త. క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంబంధించి బ్యాంక్ పలు కీలక నిబంధనల్లో మార్పులు ప్రకటించింది. నవంబర్ 25 నుంచి ప్రారంభమై డిసెంబర్ 15 వరకు ఈ మార్పులు దశలవారీగా అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ లావాదేవీల ఛార్జీలు, క్రెడిట్ కార్డు రీప్లేస్‌మెంట్ ఫీజు, ఉచిత ఇన్సూరెన్స్, సినిమా టికెట్ ప్రయోజనాలపై ఈ మార్పులు ప్రభావం చూపనున్నాయి.

నవంబర్ 25 నుంచి విదేశీ లావాదేవీలపై అదనపు భారం
మొదటగా నవంబర్ 25 నుంచి కొన్ని బిజినెస్, కార్పొరేట్ క్రెడిట్ కార్డులపై అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించిన డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) ఛార్జీలను బ్యాంక్ పెంచనుంది. ప్రస్తుతం 1 శాతంగా ఉన్న ఈ ఛార్జీని 3.50 శాతానికి పెంచుతోంది. ఈ మార్పు ఐసీఐసీఐ బిజినెస్ బ్లాక్ అడ్వాంటేజ్, బిజినెస్ బ్లూ అడ్వాంటేజ్, ట్రావెల్ ఏజెంట్ కార్డు, బిజినెస్ ప్లాటినం కార్డులకు వర్తించనుంది. దీంతో విదేశాల్లో ఈ కార్డులను ఉపయోగించే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఇక క్రెడిట్ కార్డు పోగొట్టుకున్నా, పాడైపోయినా కొత్త కార్డు పొందేందుకు చెల్లించాల్సిన రీప్లేస్‌మెంట్ ఛార్జీని కూడా బ్యాంక్ పెంచుతోంది. ప్రస్తుతం రూ.200తో పాటు జీఎస్టీ వసూలు చేస్తుండగా, డిసెంబర్ 11 నుంచి ఈ మొత్తాన్ని రూ.300తో పాటు జీఎస్టీకి పెంచనుంది. అంటే వినియోగదారులు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, 1838 రిజర్వ్, టైమ్స్ బ్లాక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.

డిసెంబర్ 15 నుంచి ఉచిత ఇన్సూరెన్స్ ప్రయోజనాలకు ముగింపు
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అందిస్తున్న ఉచిత బీమా ప్రయోజనాల్లోనూ కీలక మార్పు రానుంది. డిసెంబర్ 15 నుంచి ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ఉచిత ఇన్సూరెన్స్ కవరేజీని నిలిపివేయనుంది. ఇందులో విమాన ప్రమాద బీమా కవరేజీతో పాటు, ఏ కారణంతోనైనా ప్రయాణం రద్దయినప్పుడు లభించే బీమా ప్రయోజనం కూడా ఉండదు. ఈ మార్పు ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, టైమ్స్ బ్లాక్, ఎమరాల్డ్, ఎమరాల్డ్ ప్రైవేట్, డైమండ్, సఫైరో, రూబిక్స్ క్రెడిట్ కార్డులకు వర్తించనుంది.

సినిమా ప్రియులకు మరో షాక్.. ఉచిత INOX టికెట్లు బంద్
క్రెడిట్ కార్డులపై ఉచిత సినిమా టికెట్లు పొందుతున్న వినియోగదారులకు కూడా బ్యాంక్ షాక్ ఇవ్వనుంది. డిసెంబర్ 15 నుంచి ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అందించే ఉచిత INOX సినిమా టికెట్ల ప్రయోజనాన్ని నిలిపివేయనుంది. రూబిక్స్, కోరల్, ఎక్స్‌ప్రెషన్స్, మేక్‌మైట్రిప్ ప్లాటినం, మేక్‌మైట్రిప్ సిగ్నేచర్, హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్, ఎమిరేట్స్ రూబిక్స్ కార్డులపై ఈ ప్రయోజనం ఇకపై అందుబాటులో ఉండదు. అంటే.. మొత్తంగా చూస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు నవంబర్ 25, డిసెంబర్ 11, డిసెంబర్ 15 తేదీలను గుర్తుంచుకోవాలి. తమ కార్డుకు ఏయే మార్పులు వర్తిస్తాయో బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో నిబంధనలు పరిశీలించుకోవడం మంచిది.