NTV Telugu Site icon

Iceland Earthquakes: 14 గంటల వ్యవధిలో 800 భూప్రకంపనలు.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఐస్‌లాండ్‌!

Iceland Earthquakes

Iceland Earthquakes

800 earthquakes in 14 hours at Iceland: వరుస భూప్రకంపనలతో ఐస్‌లాండ్ వణికిపోతోంది. సుమారు 14 గంటల వ్యవధిలో 800 ప్రకంపనలు సంభవించాయి. రెక్జానెస్‌ ప్రాంతంలో శక్తివంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వరుస భూకంపాల కారణంగా గ్రిండవిక్‌లో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుందనే భయంతో ఐస్‌లాండ్‌ శుక్రవారం అత్యవసర పరిస్థితిని (Iceland Emergency) ప్రకటించింది. గ్రిండవిక్‌లో నివసిస్తున్న వేలాది మందిని ఖాళీ చేయమని స్థానిక అధికారులు ముందుజాగ్రత్తగా ఆదేశాలు జారీ చేశారు.

ఐస్‌లాండ్‌లో శుక్రవారం (నవంబర్ 10) సాయంత్రం రాజధాని రెక్జావిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రెండు శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. వాటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.2గా నమోదైంది. ప్రకంపనలతో అక్కడి రహదారులు ధ్వంసం కావడంతో.. రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు దాదాపుగా 800 ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు అంటున్నారు. అక్టోబర్ చివరి నుంచి రెక్జానెస్‌ ప్రాంతంలో ఏకంగా 24 వేల ప్రకంపనలు సంభవించాయి.

Also Read: Chandra Mohan: చంద్రమోహన్‌తో నటిస్తే చాలు.. స్టార్స్‌ అయిపోతారు!

ఇటీవలి వారాల్లో ఫాగ్రాడల్స్‌ఫ్జల్ అగ్నిపర్వతం చుట్టూ వేలాది ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని ఐస్‌లాండ్ వాతావారణ విభాగం అధికారులు హెచ్చరించారు. రానున్న రోజుల్లో విస్ఫోటం సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం భూ ప్రకంపనలు సంభవించిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో గ్రిండావిక్‌ అనే జనావాస ప్రాంతం ఉంది. అక్కడ నాలుగు వేల మంది ప్రజలు నివసిస్తుండగా.. ముందస్తు జాగ్రత్తగా అక్కడి నుంచి వారిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐస్‌లాండ్‌ శుక్రవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

Show comments