ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..

Sri Charani

Sri Charani

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం మహిళా ఆటగాళ్ల తాజా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా సెమీఫైనల్‌కు చేరనప్పటికీ.. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో చరణి రెండు వికెట్లు తీసి ఆకట్టుకుంది.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మార్పులు..
టాప్-5 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టోర్నీలో 8 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరగా, ఆమె సహచర ప్లేయర్ లారెన్ బెల్ మూడు స్థానాలు ఎగబాకి నాల్గో స్థానానికి చేరుకుంది. సౌతాఫ్రికా స్పిన్నర్ నాన్కులులేకో మ్లాబా (5వ స్థానం), పాకిస్థాన్ సీనియర్ బౌలర్ నష్రా సంధు (9వ స్థానం) కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. మారిజానే కాప్ (14వ స్థానం), బ్రీ ఇల్లింగ్ (31వ స్థానం) కూడా పైకి ఎగబాకారు.

బ్యాటింగ్ ర్యాంకింగ్స్..
బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన జార్జియా వోల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బెత్ మూనీ రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ మూడో స్థానానికి చేరుకుంది. ఐర్లాండ్‌పై సెంచరీ చేసిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు ఏడో స్థానానికి, ఇంగ్లాండ్ ఓపెనర్ డ్యానీ వ్యాట్ హాడ్జ్ 11వ స్థానానికి చేరుకున్నారు. భారత్‌పై హాఫ్ సెంచరీ (56) చేసిన ఆసీస్ సీనియర్ ప్లేయర్ ఎల్సి పెర్రీ ఐదు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకుకు చేరుకుంది.

ఆల్‌రౌండర్స్ జాబితా..
వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆల్‌రౌండర్ల జాబితాలో నెం.1 స్థానాన్ని నిలబెట్టుకోగా.. న్యూజిలాండ్ ప్లేయర్ అమేలియా కెర్ రెండో స్థానంలో ఉంది. ఐర్లాండ్ స్టార్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్ సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకుంది. మారిజానే కాప్ (8వ స్థానం), అన్నాబెల్ సదర్లాండ్ (17వ స్థానం) కూడా మెరుగైన ర్యాంకులు సాధించారు.

కాగా.. మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు అర్హత సాధించాయి. లండన్‌లోని కేన్నింగ్టన్ ఓవల్‌లో మంగళవారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.