Site icon NTV Telugu

Mohammad Siraj: ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ మియాకు కెరీర్ బెస్ట్

01

01

Mohammad Siraj: ఓవల్ టెస్ట్‌లో విక్టరీ హీరోగా చెప్పుకోదగిన వారిలో మహ్మద్ సిరాజ్ ముందు వరుసలో ఉంటాడు. విజయతీరాలకు చేరకుండానే టీమ్ ఇండియా ఇంటి బాట పడుతుందేమో అన్న అనుమానం ఏదో మూలకు కాస్త ఉన్నా దానిని పటాపంచలు చేస్తూ ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తన సంచలనాత్మక బౌలింగ్ ప్రదర్శనతో సిరాజ్ ఐదో టెస్ట్ మ్యాచ్‌లో విజృంభించి భారత్‌ను సంబరాల్లో ముంచెత్తాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సిరాజ్ మియా ICC టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్‌కు చేరుకున్నాడు.

READ MORE: R*ape Victim: ఆడ శిశువుకు జన్మనిచ్చిన 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు.. తండ్రిని గుర్తించేందుకు డీఎన్ఏ టెస్ట్

అత్యుత్తమ స్థానానికి హైదరాబాదీ బౌలర్..
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరిస్‌లో గొప్ప ప్రదర్శన చేసిన సిరాజ్ ఐసిసి టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరుకున్నాడు. 31 ఏళ్ల సిరాజ్ మియా చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండవ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసుకుని భారత్ విజయంలో కీ ప్లేయర్‌గా నిలిచాడు. గొప్ప బౌలింగ్ ప్రదర్శనతో సిరాజ్ 15 స్థానాలు ఎగబాకి 674 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానానికి చేరుకున్నాడు. 23 వికెట్లు తీసి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న టెస్ట్ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా 889 రేటింగ్ పాయింట్లతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

మెరుగుపడిన ప్రసిద్ధ్ కృష్ణ ర్యాంకింగ్..
టీమ్ ఇండియా మరో సూపర్ హీరో ప్రసిద్ధ్ కృష్ణ. ఇంగ్లాండ్‌తో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ భారత బౌలర్ మొత్తం 8 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఈనేపథ్యంలో ప్రసిద్ధ్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో 25 స్థానాలు ఎగబాకి 59వ స్థానానికి చేరుకున్నాడు. రానున్న రోజుల్లో జరగనున్న టెస్ట్ సిరీస్‌లలో అతను తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాడు.

టెస్ట్ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకిన జైస్వాల్
టెస్ట్ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ మూడు స్థానాలు ఎగబాకి 792 రేటింగ్ పాయింట్లతో ఐదవ స్థానానికి చేరుకున్నాడు. ఐదవ టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేయడం ద్వారా జైస్వాల్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే ఒక్కొక్కరు ఒక స్థానం ఎగబాకి వరుసగా ర్యాంకింగ్స్‌లో 2, 42వ స్థానాలకు చేరుకున్నారు. ది ఓవల్‌లో సూపర్ సెంచరీతో చెలరేగిన జో రూట్ 908 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో జడ్డు ఫస్ట్..
టెస్ట్ సిరీస్‌ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన చేసిన ప్లేయర్ రవీంద్ర జడేజా. టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో 408 రేటింగ్ పాయింట్లతో జడ్డు అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆకాష్ దీప్ ఓవల్ టెస్ట్‌లో 66 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 12 స్థానాలు ఎగబాకి 62వ స్థానానికి చేరుకున్నాడు.

READ MORE: NTV Podcast Promo: “ఆగడు” కథ చేసి ఉండకూడదు.. శ్రీను వైట్ల వద్ద రూ. 2000 కోట్లు!!

Exit mobile version