ICC: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మహిళల క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తొలి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌లో కీలక మార్పులు చేసింది. వచ్చే ఏడాది శ్రీలంక వేదికగా జరగనున్న ఈ టోర్నీని మొదట జూన్-జూలై నెలల్లో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, తాజాగా ఫిబ్రవరి నెలకు మార్చినట్లు ఐసీసీ ప్రకటించింది. అహ్మదాబాద్‌లో తాజాగా జరిగిన ఐసీసీ త్రైమాసిక సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. అయితే షెడ్యూల్ మార్పుకు గల కారణాలను ఐసీసీ వెల్లడించలేదు. ఈ టోర్నీ కారణంగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మహిళల సిరీస్‌తో కొంత మేర షెడ్యూల్ మారవచ్చు.
ఈ సమావేశంలో 2028 మహిళల టీ20 ప్రపంచకప్ అర్హత రూట్ మ్యాప్ ను కూడా ఐసీసీ ఖరారు చేసింది. పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీలో భారత్ తన మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడనుంది. 12 జట్లతో నిర్వహించే ఈ టోర్నీకి 10 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. 2026 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు, ఆతిథ్య దేశం (అర్హత పొందకపోతే), అలాగే 2026 జూలై 6 నాటికి ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ప్రవేశం పొందనున్నాయి. మిగిలిన రెండు స్థానాలను 10 జట్లతో జరిగే గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా నిర్ణయిస్తారు. దీనికి ప్రాంతీయ క్వాలిఫయింగ్ టోర్నీలు మద్దతుగా ఉంటాయి.
అహ్మదాబాద్ సమావేశంపై స్పందించిన ఐసీసీ ఛైర్మన్ Jay Shah, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి, సమర్థవంతమైన పరిపాలన, సమాన అవకాశాల కల్పనపై ఐసీసీ కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల క్రికెట్, అభివృద్ధి చెందుతున్న దేశాల క్రికెట్, ఫ్రాంచైజీ లీగ్‌ల నిర్వహణ వంటి అంశాలపై తీసుకున్న నిర్ణయాలు అభిమానులకు మరింత పోటీతో కూడిన, ఆసక్తికరమైన క్రికెట్‌ను అందించడంలో దోహదపడతాయని పేర్కొన్నారు.
మరోవైపు టెస్ట్ క్రికెట్‌లో వెలుతురు సమస్య కారణంగా ఆటకు అంతరాయం కలగకుండా ఉండేందుకు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. డే టెస్టు మ్యాచ్‌ల్లో అవసరమైన సమయంలో ఎర్ర బంతి స్థానంలో పింక్ బాల్ వినియోగానికి ప్రయోగాత్మకంగా అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు పింక్ బాల్‌ను కేవలం డే-నైట్ టెస్టుల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. 2015 నవంబర్‌లో తొలి డే-నైట్ టెస్టు నిర్వహించారు. ప్రేక్షకులను ఆకర్షించడం, టెస్ట్ క్రికెట్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడం లక్ష్యంగా పింక్ బాల్ టెస్టులను ప్రవేశపెట్టారు. ఇకపై వెలుతురు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎర్ర బంతితో ఆట కొనసాగించడం కష్టమైతే, పింక్ బాల్‌ను ఉపయోగించి ఆటను కొనసాగించే అవకాశాన్ని పరిశీలించనున్నారు. దీంతో టెస్ట్ మ్యాచ్‌ల్లో వర్షం లేదా వెలుతురు కారణంగా కోల్పోయే ఆట సమయం తగ్గే అవకాశం ఉందని ఐసీసీ భావిస్తోంది.
