I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!

I Bomma

I Bomma

I BOMMA: గెంటేస్తే.. గేటు కూడా డబుల్ స్పీడ్‌లో వస్తుంది.. అలాగే ఉంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పైరసీ పరిస్థితి. ఇటీవలే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి.. ఆ తర్వాత విడుదల చేశారు. కానీ అదే ఐ బొమ్మ.. బప్పం పేరుతో మళ్లీ పైరసీ వెబ్‌సైట్లు ప్రత్యక్షం కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా ప్రత్యక్షమైన ఐ బొమ్మ.. అండ్ ఐ బప్పం వెబ్‌సైట్లు అత్యాధునికంగా తయారైనట్లు పోలీసులు గుర్తించారు. ఐతే వాటితో సంబధం లేదని ఐ బొమ్మ రవి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ యాంటీ వీడియో పైరసీ సెల్‌ ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లపై నమోదైన కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ వెబ్‌సైట్ల ద్వారా కాపీరైట్‌ కలిగిన సినిమాలను అక్రమంగా స్ట్రీమింగ్‌ చేయడం, అలాగే చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌ యాప్‌లను ప్రోత్సహించడం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. వెబ్‌సైట్లపై నిర్వహించిన ప్రాథమిక సాంకేతిక విశ్లేషణలో.. గుర్తుతెలియని వ్యక్తులు ఆ రెండు పేర్లతో ఈ ప్లాట్‌ఫామ్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వెబ్‌సైట్ల ద్వారా తెలుగుతో పాటు ఇతర భాషల తాజా సినిమాలు, ఓటీటీ సినిమాలను అనధికారికంగా ఉచితంగా స్ట్రీమింగ్‌ చేయిస్తున్నారని తేల్చారు.

వినియోగదారులు తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ తదితర భాషలను ఎంపిక చేసుకుని ఈ పైరేటెడ్‌ కంటెంట్‌ను సులభంగా వీక్షించే విధంగా ప్లాట్‌ఫారం పనిచేస్తోందని గుర్తించారు. వెబ్‌సైట్‌ సోర్స్‌ కోడ్, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ సాంకేతిక పరిశీలనలో కొన్ని కీలక అంశాలను గుర్తించారు. గూగుల్‌కు చెందిన ఉచిత హోస్టింగ్‌ బ్లాగ్‌స్పాట్‌.కామ్‌ను ఫ్రంట్‌ఎండ్‌గా ఉపయోగించి అక్రమ పోర్టల్‌ను హోస్ట్‌ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రీమియం స్ట్రీమింగ్‌ సైట్ల మాదిరిగా కనిపించేలా డార్క్‌ థీమ్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగిస్తూ, సర్వర్‌ ఖర్చులు, తక్షణ టేక్‌డౌన్‌ చర్యలను తప్పించుకుంటున్నారని చెబుతున్నారు పోలీసులు. ఎంబెడెడ్‌ వీడియో స్ట్రీమింగ్‌ విధానంలో బ్లాగ్‌స్పాట్‌ ప్లాట్‌ఫారంలోనే కస్టమ్‌ వీడియో స్ట్రీమింగ్‌ ప్లేయర్లను విజయవంతంగా అమర్చారని, దీని ద్వారా తెలుగు సినిమాలతోపాటు కాపీరైట్‌ హక్కులు కలిగిన సినిమాలను అసలు హక్కుదారుల అనుమతి లేకుండా ప్రదర్శిస్తున్నారని పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి తేల్చారు.

చట్టవిరుద్ధంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను కూడా వీళ్లు ప్రోత్సహిస్తున్నారని.. వినియోగదారులు సినిమా చూడటానికి ప్లే బటన్‌ నొక్కినప్పుడు, మొదట ‘1ఎక్స్‌బెట్‌’ అనే బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన ప్రమోషనల్‌ వీడియో ప్రకటనలు కనిపించేలా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. అలాగే వీడియోను పాజ్‌ చేసిన ప్రతిసారి ‘4రాబెట్‌’ అనే మరో అక్రమ బెట్టింగ్‌ వెబ్‌సైట్‌కు సంబంధించిన ప్రకటనలు కనిపించేలా డిజైన్‌ చేసినట్లు చెబుతున్నారు. ఇలా ఆన్‌లైన్‌ జూదం, బెట్టింగ్‌ యాప్‌ల ప్రోత్సాహం పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ కేటుగాళ్లు అధునాతన యాంటీ ఇన్వెస్టిగేషన్‌ విధానాలు అవలంభిస్తున్నారు. వెబ్‌సైట్‌ సోర్స్‌ కోడ్‌లో అలాంటి కోడ్స్‌ ఉన్నాయి. ఇవి బ్రౌజర్‌ డెవలపర్‌ టూల్స్‌ను బ్లాక్‌ చేయడం, రైట్‌ క్లిక్‌ను నిలిపివేయడం, కీబోర్డ్‌ షార్ట్‌కట్‌లను నిరోధించడం, కాన్‌సోల్‌ లాగ్స్‌ తొలగించడం ద్వారా దర్యాప్తు సంస్థలకు ఆధారాలు దొరక్కుండా రూపొందించారు.

ఇలా బెట్టింగ్‌ ప్రమోషన్లతో పాటు, అడ్మినిస్ట్రేటర్లు థర్డ్‌ పార్టీ పాప్‌అప్‌ అండర్‌ యాడ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ అక్రమ ట్రాఫిక్‌ను వినియోగించి భారీగా అక్రమ ఆర్థిక లాభాలు పొందుతున్నారు. దీని వల్ల అసలు కాపీరైట్‌ యజమానులు, నిర్మాతలు, మొత్తం తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసును సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది ఐ బొమ్మ రవిని అరెస్టు చేసిన తర్వాత ‘ఐబొమ్మ’, ‘ఐబప్పం’ వెబ్‌సైట్లు మూతపడ్డాయి. తాజాగా ఇవే పేర్లతో వచ్చిన కొత్త వాటిలో పైరసీ సినిమాలు ప్రత్యక్షం కావడంతో ఫిల్మ్‌ ఛాంబర్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సైబర్‌ క్రైమ్‌ అధికారులు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న రవిని వివరణ కోరారు. అయితే వాటితో తనకు సంబంధం లేదని అతడు స్పష్టం చేసినట్లు తెలిసింది.