NTV Telugu Site icon

Ajinkya Rahane: అందుకే నేను రివ్యూ తీసుకోలేదు.. అసలు విషయం చెప్పిన రహానే!

Ajinkya Rahane Kkr

Ajinkya Rahane Kkr

ఐపీఎల్‌ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ దారుణ ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 15.3 ఓవర్లకు 111 పరుగులకు కుప్పకూలింది. ఛేదనలో కోల్‌కతా 15.1 ఓవర్లకు 95 పరుగులకే ఆలౌటై.. 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ తన స్పిన్ బౌలింగ్‌లో విజృంభించి.. 28 పరుగులిచ్చి కీలక 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే వికెట్ కూడా ఉంది. అయితే జింక్స్ రివ్యూ తీసుకోకపోవడం కోల్‌కతా విజయావకాశాలపై ప్రభావం చూపింది.

కోల్‌కతా ఇన్నింగ్స్‌లోని 8వ ఓవర్ యుజ్వేంద్ర చహల్‌ వేశాడు. అప్పటికే అజింక్య రహానే క్రీజులో కుదురుకున్నాడు. 8వ ఓవర్లోని నాలుగో బంతిని చహల్‌ గూగ్లీ వేయగా.. రహానే స్వీప్‌ షాట్‌ ఆడాడు. బంతి ఎక్కువగా టర్న్‌ కాకపోవడంతో.. బాల్ జింక్స్ ప్యాడ్లకు తాకింది. చహల్‌ అపీల్‌ చేయడంతో.. ఫీల్డ్ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. రహానే రివ్యూకు వెళ్లలేదు. అయితే రిప్లేలో బంతి పిచింగ్‌ ఔట్‌ సైడ్‌గా కనిపించింది. ఒకవేళ రివ్యూకు వెళ్లి ఉంటే.. రహానేను థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించేవాడు. దీనిపై మ్యాచ్‌ అనంతరం రహానే మాట్లాడుతూ.. రివ్యూను సేవ్‌ చేయాలని తీసుకోలేదన్నాడు.

‘నేను రాంగ్ షాట్ ఆడాను. బంతి పిచింగ్‌ మిస్ అయిందనేది అంగ్‌క్రిష్‌ రఘువంశీకి ఖచ్చితంగా తెలియదు. నాకు కూడా ఖచ్చితంగా తెలియదు. అంపైర్ కాల్ కావచ్చని రఘువంశీ చెప్పాడు. ఆ సమయంలో నేను అవకాశం తీసుకోకూడదనుకున్నాను. రివ్యూను సేవ్‌ చేయాలనుకున్నా. కీలక సమయంలో ఉపయోగపడుతుందనుకున్నా. ఒకవేళ నేను రివ్యూ తీసుకుంటే అనవసరంగా కోల్పోతాం అనుకున్నా. అందుకే రివ్యూ తీసుకోలేదు. మైదానం బయటికి వెళ్లాక చూస్తే బంతి పిచింగ్‌ ఔట్‌ సైడ్‌గా కనిపించింది’ అని అజింక్య రహానే చెప్పాడు. జింక్స్ 17 బంతుల్లో 17 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.