NTV Telugu Site icon

Sukesh Chandrashekar: సత్యేంద్రజైన్‌కు రూ.10 కోట్లు లంచం ఇచ్చా.. ఆప్ మంత్రికి నెలకు రూ.2కోట్లు!

Conman Chandrashekar

Conman Chandrashekar

Sukesh Chandrashekar: ఆర్థిక నేరస్థుడు, రూ. 200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్‌ ఢిల్లీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్రజైన్‌ బలవంతంగా తన నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారని ఆరోపించాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చిన ఆరోపణలు చేయడం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మేరకు ఆమ్‌ ఆద్మీ పార్టీకి ముడుపులు అందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు సుకేశ్‌ లేఖ రాసినట్లు తెలిసింది. తనను జైలులో తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, తనకు రక్షణ కల్పించేందుకు జైలులోనే ఉన్న సత్యేంద్ర జైన్‌కు రక్షణ కోసం డబ్బులు ఇచ్చానని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ ఆరోపించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.50 కోట్లకు పైగా సుకేష్‌ ఇచ్చినట్లు వెల్లడించింది. అందులో రాజ్యసభ నామినేషన్ కోసం రూ.50 కోట్లు తీసుకుందని పేర్కొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ అంటేనే ఒక మోసాల పార్టీ అంటూ ఆరోపించింది.

లెఫ్టినెంట్‌ గవర్నర్ వీకే సక్సేనా పంపిన లేఖ ప్రకారం. 2015 నుంచి సత్యేంద్రజైన్‌తో తనకు పరిచయం ఉందని సుకేష్ చంద్రశేఖర్‌ తెలిపాడు. పార్టీ విస్తరణ తర్వాత రాజ్యసభకు నామినేట్‌ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తనకు హామీ ఇచ్చిందన్నారు. అందుకోసం రూ.50 కోట్లు సమకూర్చినట్లు వెల్లడించాడు. 2017 తాను అరెస్టయిన తర్వాత జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్‌ తనను కలిశారని.. జైల్లో రక్షణ, సదుపాయాలు కల్పించాలంటే ప్రతినెలా తనకు రూ.2కోట్లు కట్టాలని జైన్‌ డిమాండ్ చేసినట్లు సుకేష్‌ లేఖలో వివరించాడు. జైళ్ల శాఖ డీజీ సందీప్‌ గోయెల్‌కు ప్రతి నెలా రూ.1.5కోట్లు ఇవ్వాలన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సత్యేంద్ర జైన్‌కు రూ.10కోట్లు, సందీప్‌ గోయెల్‌కు రూ.12.5కోట్లు చెల్లించినట్లు సుకేష్ తెలిపాడు. ఇటీవల దర్యాప్తులో జైళ్లలో జరుగుతున్న దోపిడీ గురించి అధికారులతు చెప్పినట్లు వెల్లడించాడు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశానని సుకేష్‌ లేఖలో వివరించాడు. అయితే సుకేశ్‌ ఆరోపణలను ఈడీ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై త్వరలోనే విచారణ చేపడతామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు వెల్లడించారు.

Salman khan Security: సల్మాన్‌ఖాన్‌కు ప్రాణహాని.. భద్రత పెంచిన ప్రభుత్వం

ఆమ్‌ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు సుకేశ్‌ చంద్రశేఖర్‌ చేసిన ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తోసిపుచ్చారు. బీజేపీ కావాలనే ఇలాంటి కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు. అవన్ని తప్పుడు ఆరోపణలని, గుజరాత్‌ ఎన్నికలు, మోర్బీ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసిన కుట్రగా ఆరోపించారు. ‘‘‘గుజరాత్‌లోని మోర్బీ నగరంలో తీగల వంతెన కూలి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటివరకు అన్ని టీవీ ఛానళ్లు ఇవే కథనాలను ప్రసారం చేశాయి. ఒక్కసారిగా ఆ వార్తలు కన్పించకుండా పోయి సుకేశ్ ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మోర్బీ ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి కల్పిత కథనాలు సృష్టిస్తున్నారని అన్పించడం లేదా?’’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.