జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో కుల వ్యవస్థ మరియు పరువు హత్యలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తనకు కాలేజీ రోజుల నుంచే కుల భావన మీద విరక్తి ఉందని, మనుషులను కులం పేరుతో విభజించడం వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘అవసరం వచ్చినప్పుడు కులం పనిచేయదు, కేవలం మనిషి మాత్రమే తోడుంటాడు”’అని ఆది స్పష్టం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ కులం ఏంటో అడగని మనం, పెళ్లి విషయానికి వచ్చేసరికి మాత్రం కులాన్ని వెతకడం ఏంటని ఆయన నిలదీశారు. ముఖ్యంగా, సమాజంలోని ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ.. అక్రమ సంబంధాల విషయంలో అడ్డురాని కులం, కేవలం పెళ్లిళ్ల దగ్గరే ఎందుకు గుర్తొస్తుంది?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
సమాజంలో పెరుగుతున్న పరువు హత్యలపై కూడా ఆది తీవ్రంగా స్పందించారు. వేరే కులాన్ని ప్రేమించారనే కారణంతో కన్నబిడ్డల ప్రాణాలు తీయడం అత్యంత దారుణమని, ఇది పరువును పెంచకపోగా మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన ప్రేమతో ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండగలరని అనిపిస్తే, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత కుటుంబాలపై ఉందని ఆయన సూచించారు. అబ్బాయి ఆర్థికంగా స్థిరంగా లేకపోతే, అతనికి తగిన సమయం ఇచ్చి, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం చేయడం సరైన మార్గమం అని.. చిన్న విషయాలకే హింసకు దారి తీయకుండా, ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, హింస వల్ల కేవలం విషాదమే మిగులుతుందని ఆయన తెలిపారు. ఎప్పుడు చలకీగా నవ్వించే ఆది ఇలా మాట్లాడటంతో అభిమానులు కూడా పాజిటీవ్ గా స్పందిస్తున్నారు.
