Site icon NTV Telugu

Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..

Hydraa

Hydraa

హైదరాబాద్ నగరంలోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూముల్లో వెలసిన పాత లేఅవుట్ల విషయంలో ‘హైడ్రా’ (HYDRAA) స్పష్టతనిచ్చింది. ఈ ప్రాంతాల్లోని ఇళ్లతో పాటు, క్రమబద్ధీకరణ (Regularization) కాని ఖాళీ ప్లాట్లపై కూడా ఎలాంటి కూల్చివేతలు లేదా ఇతర చర్యలు ఉండవని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. యూఎల్‌సీ భూముల్లోని ఖాళీ ప్లాట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని లేదా హైడ్రా కూల్చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి భయాందోళనలు సృష్టించి, తక్కువ ధరకే ప్లాట్లను కాజేయాలని చూసే కబ్జాదారుల మాటలను నమ్మవద్దని సంస్థ కోరింది.

లేఅవుట్ నిబంధనల ప్రకారం రోడ్లు, పార్కులు , ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలు కబ్జాకు గురైతే మాత్రమే హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రజల ఉమ్మడి ఆస్తులను కాపాడటమే తమ ప్రాధాన్యతని స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటుకు (19.07.2024) ముందే నిర్మించిన నివాసాలను తాము ముట్టుకోబోమని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు సంస్థ పునరుద్ఘాటించింది.

Also Read:627 కిలోమీటర్ల రేంజ్‌.. TATA Safari EV వచ్చేది ఎప్పుడంటే..?

శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని రాజరాజేశ్వరి నగర్, ఓయూ కాలనీ, రాఘవేంద్ర కాలనీల్లో కేవలం పార్కులు, రోడ్ల స్థలాల్లో వెలసిన ఆక్రమణలను మాత్రమే తొలగించినట్లు సంస్థ పేర్కొంది. అలాగే హైదర్‌నగర్‌లోని గోపాల్ నగర్ లేఅవుట్ పార్కును కూడా కబ్జా నుంచి కాపాడినట్లు వెల్లడించింది. నివాసితులకు ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించి క్లారిటీ తీసుకోవాలని సూచించింది. మీ ఆస్తులను తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని నగర ప్రజలను అప్రమత్తం చేసింది.

Exit mobile version