World Green City: హైదరాబాద్ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అక్టోబర్ 14న దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ -2022లో హైదరాబాద్ ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022’, ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్’ విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది.
భారత్ నుంచి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ అందుకున్న ఏకైక నగరం హైదరాబాద్ కావడం విశేషం. మరో విభాగమైన లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్‌లో మరో అవార్డును అందుకుంది. నగర వాసులందరూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థలు, పరిష్కారాలను రూపొందించడంపై ఈ కేటగిరీ దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ర్టానికి గ్రీన్ నెక్లెస్‌గా పిలిచే ఓఆర్‌ఆర్ చుట్టూ పచ్చదనం పెంపుతో నగరం ఈ విభాగంలో ఉత్తమమైనదిగా ఎంపికైంది. దేశంలోని నగరాల్లో హైదరాబాద్ మాత్రమే ఈ అవార్డును గెలుచుకోవడం తెలంగాణతో పాటు భారతదేశానికే గర్వకారణమని శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఓ అధికారిక ప్రకటన పేర్కొంది.
Global Hunger Index: ఆకలి సూచీలో అట్టడుగున భారత్.. మనకన్నా పాక్, నేపాల్‌లే బెటర్..
ఈ అవార్డులను హైదరాబాద్ గెలుచుకున్న సందర్భంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, హెచ్‌ఎండీఏ బృందాన్ని, స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నగరానికి ప్రతిష్టాత్మకమైన “ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్” (AIPH) అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.ఈ అంతర్జాతీయ అవార్డులు తెలంగాణ, దేశ ఖ్యాతిని మరింత బలోపేతం చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం, పట్టణాభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తూ.. దేశానికి పచ్చని ఫలాలను అందజేస్తోందనడానికి ఈ అంతర్జాతీయ అవార్డులే నిదర్శనమని ఆయన శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతర్జాతీయ అవార్డులకు భారతదేశం నుండి ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గర్వకారణమని ఆయన అన్నారు.