Hyderabad Water Supply Alert: దసరా పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2కు సంబంధించిన పైప్‌లైన్ ఉప్పల్ బాగాయత్ సమీపంలోని నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్ద ప్రమాదవశాత్తు దెబ్బతింది. ఈ ప్రాంతంలో ఓ కారు పైప్‌లైన్‌కు సంబంధించిన ఎయిర్ వాల్వ్‌ల వ్యవస్థను బలంగా ఢీకొనడంతో.. అవి దెబ్బతిని నీటి లీకేజీ ఏర్పడింది. ఈ ఘటన నేపథ్యంలో దెబ్బతిన్న ఎయిర్ వాల్వ్‌లను మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు జలమండలి అత్యవసర చర్యలు చేపట్టింది. ఈ పనుల కారణంగా కృష్ణా ఫేజ్-2 సరఫరా వ్యవస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది.
బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, బీరప్పగడ్డ, రామంతాపూర్, ఉప్పల్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, పద్మారావునగర్, బేగంపేట, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, నల్లగుట్ట, మెట్టుగూడ, వైశాలినగర్, మీర్‌పేట, బడంగ్‌పేట, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, మారేడుపల్లిలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మరమ్మత్తు పనులు పూర్తి కాగానే యధావిధిగా నీటి సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మరమ్మతుల పనులపై తాజా పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్‌మిషన్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు.
లీకేజీ వల్ల నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం కారణంగా తాగునీటి సరఫరాలో ఏర్పడే తాత్కాలిక అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. సంబంధిత ప్రాంతాల వినియోగదారులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు సహకరించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

