Water Crisis: హైదరాబాద్ సిటీలో జలగండం.. అడుగంటిన భూగర్భ జలాలతో అపార్ట్‌మెంట్ వాసుల తిప్పలు..!

Hyd Water Crisis

Hyd Water Crisis

Water Crisis: హైదరాబాద్ వెస్ట్ సిటీలో నీటి కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఎల్ నినో (El Niño) ప్రభావంతో భూగర్భ జలాలు భారీగా పడిపోవడంతో బోర్ల నుంచి చుక్క నీరు కూడా రావడం లేదు. ఐటీ కారిడార్, భారీ గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న వెస్ట్ సిటీలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీటి అవసరాలు కూడా భారీగా పెరిగాయి. గతంలో జలమండలి సరఫరాతో పాటు బోర్ల ద్వారా నీటి అవసరాలు తీరేవి. కానీ ఇప్పుడు బోర్లు పూర్తిగా ఎండిపోవడం, జలమండలి సరఫరా అపార్ట్‌మెంట్ల అవసరాలకు ఏమాత్రం సరిపోకపోవడంతో నివాసితులకు ప్రైవేట్ ట్యాంకర్లే దిక్కయ్యాయి. నవంబర్ నెలలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, రానున్న వేసవిలో జనవరి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తీవ్రమైన నీటి కొరత కారణంగా వెస్ట్ సిటీలోని పలు అపార్ట్‌మెంట్లు నీటి వినియోగంపై కఠిన నియంత్రణలు విధిస్తున్నాయి. గతంలో రోజంతా అవసరానికి అనుగుణంగా నీళ్లు వాడుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకే నీటి సరఫరా చేస్తున్నారు. ఆ ఒక్క గంట సమయంలోనే ఇంటి అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవాలని అసోసియేషన్లు సూచిస్తున్నాయి. ప్రతి అవసరానికి లెక్క చూసి నీటిని వాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నీటి వృథాను అరికట్టేందుకు మొక్కలకు నీళ్లు పోయడం కూడా నిలిపివేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక మనిషికి రోజుకు సగటున 130 లీటర్ల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 30 నుంచి 40 లీటర్లకు మించి వాడకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నా నీళ్లు సరిపోవడం లేదని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతున్న అపార్ట్‌మెంట్లకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా ట్యాంకర్లు అందుబాటులో లేకపోవడం, బుక్ చేసుకున్న సమయానికి రాకపోవడం, ప్రైవేట్ ట్యాంకర్ల సరఫరాపై ఉన్న నియంత్రణలు తమ కష్టాలను మరింత పెంచుతున్నాయని నివాసితులు చెబుతున్నారు. గతంలో రెండు రోజులకు 2,000 లీటర్ల వరకు నీరు అందుబాటులో ఉండేదని, ఇప్పుడు అది కేవలం 500 నుంచి 700 లీటర్లకే పరిమితమైందని వాపోతున్నారు. దీనివల్ల ఉదయాన్నే స్కూళ్లకు వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక ఒక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ ధర రూ.1,200 నుంచి రూ.1,500 వరకు పలుకుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుగుతోంది. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల జీతం పొందే సామాన్యులు, రెండు మూడు రోజులకోసారి అంత డబ్బు పెట్టి ట్యాంకర్లు కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు సైతం రోజుకు ఎన్ని ట్యాంకర్లు వస్తున్నాయి.? నెలకు ఎంత ఖర్చు అవుతుందనే ప్రత్యేక లెక్కలు వేస్తూ.. ట్యాంకర్ల కొనుగోలు కోసం మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచాల్సిన పరిస్థితి వస్తోందని చెబుతున్నాయి.

వెస్ట్ సిటీలో భవిష్యత్తు నీటి భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. డిసెంబర్ నాటికి పూర్తిగా నీళ్లు ఎండిపోతాయని అంచనా వేయగా, నవంబర్‌లోనే ఆ పరిస్థితి దాపురించిందని అపార్ట్‌మెంట్ యజమానులు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ నీటి వనరుల కోసం అన్వేషిస్తున్నప్పటికీ ఫలితం లేకపోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, జలమండలి తక్షణమే స్పందించి ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జలమండలి నీటి సరఫరాను పెంచడంతో పాటు, భూగర్భ జలాల రీఛార్జ్ మరియు శుద్ధి చేసిన నీటి (రీసైకిల్డ్ వాటర్) వినియోగంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని వెస్ట్ సిటీ నివాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు.