ఓ వైపు కొడుకు అనారోగ్యం.. మరోవైపు కుటుంబాన్ని పట్టించుకోని భర్త.. పైగా ఆర్ధికంగా రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. పెద్ద కొడుకుపై దొంగతనం ముద్ర పడడంతో మానసికంగా మరింత కుంగిపోయింది. ఆ తల్లి అలసిపోయి.. ఇక బతకలేనని నిర్ణయించుకుంది. పుట్టెడు దుఃఖంతో చిన్న కొడుకు కళ్లెదుటే బలవన్మరణం చెందింది. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్‌లో విషాదం నింపింది.
ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వారి పేర్లు నరసింహ, సుధ. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా కందుకూరు. సుధ, నర్సింహ దంపతులు జీవనోపాధి కోసం 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. గత నాలుగేళ్లుగా వనస్థలిపురం సమీపంలోని మారుతీనగర్‌లోని ఓ పెంట్‌హౌస్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరికి 16, 13 ఏళ్ల వయస్సు కలిగిన ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే సుధ, నరసింహ జంట.. జీవనాధారం కోసం పల్లెటూరిని వదిలిపెట్టి పట్నానికి చేరారు. అప్పటి నుంచి హైదరాబాదులో ఉంటూ చిన్నచితికా పనులు చేసుకుంటున్నారు. సుధ ఇంటి పనులు చేస్తుండగా… నరసింహ కూలి పని చేసుకుంటున్నాడు. ఇద్దరు పిల్లలను ఇక్కడే చదివించారు.
ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ఈ మధ్య భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న నర్సింహ మద్యానికి బానిసై కుటుంబం బాధ్యతలు వదిలేశాడు. దీంతో సుధ ఇళ్లలో వంట పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. దీనికి తోడు చిన్న కుమారుడు చిన్నప్పటి నుంచే మధుమేహంతో బాధపడుతున్నాడు. అతనికి చికిత్స చేయించే పరిస్థితి లేక సుధ తీవ్ర మనస్తాపానికి గురయ్యేది. ఇటీవల పెద్ద కుమారుడు.. పొరపాటున తల్లి సుధ పని చేసే ఇంట్లో ఇనుపరాడ్డు దొంగతనం చేశాడు. దీంతో ఆ ఇంటి యజమాని మందలించడంతో ఆమె మానసికంగా మరింత కుంగిపోయింది.
Also Read: Hyderabad Drugs: రూటు మార్చిన డ్రగ్ స్మగ్లర్లు.. కొంపలోనే కుంపటి పెట్టారు!
ఓ వైపు ఆర్ధిక బాధలు.. మరోవైపు చిన్న కొడుకు అనారోగ్యం ఆ తల్లిని తీవ్రంగా కుంగదీశాయి. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. పెద్ద కుమారుడిని పెరుగు తీసుకురమ్మని బజారుకు పంపింది. చిన్న కుమారుడు ఇంట్లో ఉండగానే.. సుధ చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లి ఉరేసుకుంటుండటం గమనించిన చిన్న కుమారుడు భయంతో.. ఆవేదనతో తల్లి కాళ్లు పట్టుకుని కాపాడడానికి ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నం వృథా అయింది. తల్లి చలనం లేకుండా పోవడంతో బాలుడు “అమ్మా… అమ్మా…” అంటూ విలపించాడు. ఇంతలో పెద్ద కుమారుడు తిరిగి వచ్చి స్థానికుల సాయంతో తల్లిని కిందకు దించి.. 108 అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించాడు. అయితే సుధ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో మారుతీనగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
