Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అధికారులు కీలక చర్యలు చేపట్టారు. H-CITI ప్రాజెక్టు పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ట్రయల్ రన్ అమల్లో ఉండనుంది. కేబీఆర్ పార్క్ మీదుగా స్టడీ సర్కిల్, బసవతారకం ఆస్పత్రి, బీఆర్ఎస్ కార్యాలయం, ఒమేగా ఆస్పత్రి మార్గం నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను పోలీసులు రెండు వైపులా ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, 45 వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఎన్‌టీఆర్ భవన్ – బసవతారకం ఆస్పత్రి – విద్యాభవన్ మార్గాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. అలాగే యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యేక డైవర్షన్లు అమలు చేస్తున్నారు. ఐటీసీ కోహినూర్, కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు రోడ్ నంబర్ 60, 67 మార్గాల ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు.
ట్రయల్ రన్ సమయంలో ఎక్కడా యూ-టర్న్‌లకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ఎడమ లేన్ లోనే ప్రయాణించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు. అలాగే రియల్‌టైమ్ ట్రాఫిక్ పరిస్థితులను తెలుసుకునేందుకు నావిగేషన్ యాప్‌లను వినియోగించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వీలైనంత వరకు కార్ పూలింగ్, ప్రజా రవాణా సేవలను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

